జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది! | Microprocessor based sand spray to prevent Vande Bharat wheels from slipping | Sakshi
Sakshi News home page

జల్లు పడితే.. ఇసుక చల్లుతుంది!

Aug 18 2026 4:16 AM | Updated on Aug 18 2026 4:16 AM

Microprocessor based sand spray to prevent Vande Bharat wheels from slipping

వందేభారత్‌లో ‘సెన్సర్‌’ ఇసుక

పట్టాలపై తడి వల్ల చక్రాలు జారకుండా మైక్రోప్రాసెసర్‌ ఆధారంగా ఇసుక స్ప్రే

రైలే స్వయంగా చేసుకునే ఈ పని.. మిల్లీసెకన్ల వ్యవధిలోనే.. 

సంప్రదాయ రైళ్ల పాత పద్ధతిని సమూలంగా మార్చేస్తున్న వందేభారత్‌  

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపై వాహనాలు జారిపోవడం సహజం... అదే తరహాలో పట్టాల మీద రైలు చక్రాలు కూడా తడికి జారి రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. దీనికి ఏళ్లుగా వినియోగిస్తున్న నిరోధక వ్యవస్థ... ఇసుకను చల్లటమే. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఇసుకను పట్టాలపైకి జార్చే బాధ్యత లోకోపైలట్‌దే. ఇప్పుడు దీన్ని మారుస్తూ వందేభారత్‌ రైళ్లు విప్లవాత్మక మార్పులతో దూసుకొచ్చాయి. ఇప్పుడు ఇసుకను చల్లే బాధ్యత లోకోపైలట్‌ది కాకుండా స్వయంగా రైలే చూసుకుంటుంది. అందులోనూ మరిన్ని కొత్త మార్పులకు వందేభారత్‌ కొత్త రైళ్లు శ్రీకారం చుడుతున్నాయి. 

సెన్సర్‌తో గుర్తింపు... మైక్రోప్రాసెసర్‌తో ఇసుక స్ప్రే... 
దేశ తొలి సెమీ హైస్పీడ్‌ ఈఎంయూ రైలు వందేభారత్‌ను రైల్వే బోర్డు  మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. సంప్రదాయ విధానాలకు స్వస్తిచెబుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మారుస్తోంది. ఇందులో ఇప్పుడు ఈ ఇసుక అంశం కీలకంగా మారింది. సాధారణంగా వాన, మంచు కురిసినప్పుడు లేదా పట్టాలపై ఆకులు నలిగి పసలు విడుదలైనప్పుడు లేదా చమురు, జిగురు లాంటివి ఉన్నప్పుడు రైలు చక్రాలు జారిపోతాయి. చక్రం తిరగకుండా ముందుకు జారి పట్టాలు తప్పుతుంది. అది రైలు కోచ్‌లు పక్కకు ఒరిగిపోవటానికి కారణమవుతుంది. ఇలా చక్రం జారిపోయినప్పుడు లోకోపైలట్‌ గుర్తిస్తాడు. వెంటనే లోకోఇంజిన్‌లో ఉండే లివర్‌ నొక్కగానే చక్రం వద్ద ఉన్న పైపు నుంచి సన్నటి ఇసుక స్ప్రే చేసినట్లుగా చక్రం ముందు జారుతుంది. దీంతో రాపిడి జరిగి చక్రం మళ్లీ పూర్వస్థితిలో తిరుగుతుంది. ఇది సంప్రదాయ విధానం. కానీ లోకోపైలట్‌ ఏమరపాటుగా ఉన్నా, సకాలంలో చక్రం జారుతున్నట్లు తెలియకపోయినా ప్రమాదాలకు అవకాశం కలుగుతుంది. దీన్ని మారుస్తూ కొన్ని ప్రీమియం కేటగిరీ రైళ్లలో ఆటోమేటిక్‌ విధానం తెచ్చినా ఇప్పుడు వందేభారత్‌లో విప్లవాత్మక మార్పులు ఆవిష్కృతమయ్యాయి. చక్రాలు జారుతుండటాన్ని గుర్తించి వేగంగా ఇసుకను స్ప్రే చేసే పనిని పూర్తిగా కంప్యూటరీకరించారు. ఇందుకోసం ఆటోమేటిక్‌ వీల్‌ స్లిప్‌ ప్రొటెక్షన్‌ సిస్టం ఏర్పాటు చేశారు. 

ఇంజన్‌ ఒక్కచోటే కాకుండా.. 
ఇసుకను చల్లే పద్ధతి సంప్రదాయ రైళ్లలో కేవలం ఇంజన్‌ చక్రాల వద్దే ఉంటుంది. మిగతా బోగీల చక్రాలు స్వయంచాలకం కానందున వాటి వద్ద అవసరం లేదన్నది రైల్వే ఉద్దేశం. వాటి వద్ద ఇసుకను జార విడిచే వ్యవస్థ ఏర్పాటు కూడా కష్ట సాధ్యమైంది. కానీ వందేభారత్‌ సంప్రదాయ రైళ్లకు పూర్తి భిన్నం. ఇందులో ఇంజన్‌ అంటూ విడిగా ఉండదు. దీని ప్రొపల్షన్‌ సిస్టమ్‌ అంతా కోచ్‌ల కింది భాగంలోనే ఉంటుంది. ప్రతి రెండవ కోచ్‌లో విద్యుత్‌ మోటార్లు ఉండటం వల్ల రైలు మొత్తం శక్తి సమంగా పంపిణీ జరిగి రైలు ముందుకు పరుగెడుతుంది. ఇలా ప్రతి పవర్‌ కోచ్‌లో ఈ శాండ్‌ బాక్స్, ఇసుక స్ప్రే వ్యవస్థ ఉంటుంది. ఒకసారి ఇసుక విడుదలకు మైక్రోప్రాసెసర్‌ సిగ్నల్‌ ఇవ్వగానే అలాంటి అన్ని కోచ్‌ల చక్రాల వద్ద ఇసుక స్ప్రే అవుతుంది. దీంతో చక్రాలు తిరిగి వేగాన్ని అందుకొని రైలు పట్టుతప్పకుండా వేగంగా ముందుకు పరుగుపెడుతుంది. ఇక అన్ని చక్రాల వద్ద ఇసుక సమంగా జారేలా కూడా మరో వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడొచ్చే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లలో ఇది మరింత అధునాతనంగా ఉండబోతోంది. సాధారణంగా తేమ చేరితే ఇసుక గడ్డకట్టి పైపులు జామ్‌ అవుతుంటాయి. దీనిని నివారించడానికి కొత్త వెర్షన్లలో అత్యాధునిక సీలింగ్‌ టెక్నాలజీని వాడుతున్నారు. 

పుణే ఘటన తర్వాత మారిన వ్యూహం! 
ఇటీవల పుణే రైల్వే స్టేషన్‌లోకి వచ్చే క్రమంలో ముంబై–సోలాపూర్‌ వందేభారత్‌ రైలు అక్కడి డైమండ్‌ కట్‌ ట్రాక్‌ ఛేంజ్‌ సమయంలో చక్రం జారి కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీన్ని రైల్వే బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలో అత్యంత వేగంగా వెళ్లే వందేభారత్‌ రైళ్లు పట్టాలు తప్పే పరిస్థితి పెను ప్రమాదానికి సంకేతంగా భావిస్తోంది. దీంతో చక్రాలు జారకుండా మరింత పకడ్బందీ వ్యవస్థ అవసరమని నిర్ణయించి పరిశోధనల కోసం ఆర్‌డీఎస్‌ఓను ఆదేశించింది. భవిష్యత్తు ప్రణాళికలపై పెద్ద మార్పులకే శ్రీకారం చుట్టింది. ఇసుక చల్లే వ్యవస్థలు ఎప్పుడూ నిరంతరం పనిచేసేలా చూసేందుకు భారీ ఖర్చుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వందేభారత్‌ రైళ్ల కోసం ఏకంగా రూ. 14,000 కోట్లతో అత్యాధునిక మెయింటెనెన్స్‌ డిపోలను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ చక్రాల రీప్రొఫైలింగ్‌తోపాటు శాండింగ్‌ సిస్టమ్స్‌ బ్లాక్‌ కాకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. ఇక ఇసుకను చల్లే సంప్రదాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రసాయనాలు చల్లే కొత్త విధానంపై పరిశోధనలకు కూడా పరిశోధకులు సిద్ధమయ్యారు.  

ఎలా పనిచేస్తుంది?
వందేభారత్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఈఎంయూ) పూర్తి ఎల్రక్టానిక్‌ వ్యవస్థతో ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా సెన్సర్లతో కూడిన మైక్రోప్రాసెసర్‌ ఆధారిత సిస్టమ్‌ ఉంటుంది. ఇది స్వయంచాలకంగా పనిచేస్తుంది. అందులోని సెన్సర్లు చక్రాలు తిరిగే వేగం, అందులో వచ్చే మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తాయి. చక్రం జారుతోందని మిల్లీసెకన్ల వ్యవధిలో గుర్తించి వెంటనే మైక్రోపాసెసర్‌కు సిగ్నల్స్‌ పంపుతాయి. దాన్ని గుర్తించి మైక్రోప్రాసెసర్‌ ఇసుక విడుదలకు వీలు కల్పిస్తుంది. చక్రాల సమీపంలోని శాండ్‌ బాక్స్‌ నుంచి కంప్రెస్డ్‌ ఎయిర్‌ ద్వారా సన్నటి ఇసుకను స్ప్రే చేస్తుంది. అది చక్రాల ముందు సరైన పరిమాణంలో సమంగా చల్లుతుంది. దీంతో చక్రం మళ్లీ మునుపటి తరహాలో తిరుగుతుంది. ఈ ప్రక్రియ మిల్లీసెకన్ల వ్యవధిలో అత్యంత వేగంగా జరిగిపోతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement