సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఏ ప్రాంతానికి వెళ్లినా చారిత్రక నేపథ్యం ఉంటుంది. శివరాంపల్లిలోని బుమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువుకు 356 ఏళ్ల చరిత్ర ఉంది. చెరువు కింది భాగంలో 1.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊట బావికి కూడా అంతే చారిత్రక నేపథ్యం ఉంది. ఇప్పటికే చెరువును పునరుద్ధరించిన హైడ్రా.. ఇప్పుడు ఆ ఊట బావికి కూడా జీవం పోయాలని నిర్ణయించింది. రెండు మూడు నెలల్లో పనులు పూర్తయి.. ఊటబావిలోకి పుష్కలంగా నీరు రానుంది.
సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో..
బుమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత మార్చి 8న ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పుడే ఈ చారిత్రక బావి విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఎం దృష్టికి తెచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చెరువు పనులను పర్యవేక్షించిన విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థనే ఈ చారిత్రక బావి పునరి్నర్మాణాన్ని కూడా చేపట్టింది.
నిజాంలు నీళ్లు తాగిన బావి
మూడో నిజాం సికందర్ జా పాలనా కాలం 1770లో ఈ సరస్సును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్‌్న–ఉద్–దౌలా పేరు మీదుగా ఈ సరస్సుకు పేరు వచ్చినట్లు సమాచారం. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు కట్ట, పరిసరాల్లోని ఔషధ మొక్కల ద్వారా నీరు సహజంగా వడపోతకు గురై బౌలిలోకి చేరేది. ఔషధ గుణాలున్న ఈ నీటిని నిజాం పాలకులు తాగేవారని చెబుతుంటారు. ఎడ్ల బండ్ల ద్వారా సుదూర ప్రాంతాలకు తరలించేవారని, లండన్ వరకు కూడా ఈ నీటి ప్రయాణం జరిగినట్లు కథనాలు ఉన్నాయి. ఒక సరస్సును కాపాడటమంటే నీరు, ప్రకృతి, వైద్యం, నిజాం రాజవంశ చరిత్రతో ముడిపడిన శతాబ్దాల నాటి వారసత్వాన్ని పరిరక్షించడంగా హైడ్రా భావిస్తోంది.


