బాంగీ: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. నానా-మంబేరే ప్రావిన్స్‌లోని అబ్బా ప్రాంతంలో ఉన్న ఒక బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గనిలో పనిచేస్తున్న 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, సహాయక సిబ్బంది శ్రమించి శిథిలాల నుంచి 30 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా పలువురు కార్మికులు మట్టి దిబ్బల కిందే చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఫ్లోరియన్ గాగుయెండే అనే కార్మికుడు మాట్లాడుతూ.. ఇది ఎటువంటి ఆధునిక సాంకేతికత లేని సాంప్రదాయ గని అని తెలిపారు. లోపల చిక్కుకున్న తోటి కార్మికులు సజీవంగా బయటపడతారనే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డిప్యూటీ మేయర్ సులేమాన్ బి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సంస్థలు తక్షణమే స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతినిధి ఇవారిస్తే నగామానా బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, అన్ని విధాలా ఆదుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. సరైన భద్రతా పరికరాలు, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గనుల విభాగంలో తక్షణ భద్రతా సంస్కరణలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


