విమాన ప్రయాణాల్లో చిన్నపిల్లలను నియంత్రించడం తల్లిదండ్రులకు ఎంతటి కష్టమైన సవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటల కొద్దీ ప్రయాణంలో పిల్లల అలసటను దూరం చేసి, వారికి సరికొత్త లోకాన్ని పరిచయం చేసేందుకు సౌదీ అరేబియాకు చెందిన నూతన జాతీయ విమానయాన సంస్థ ‘రియాద్ ఎయిర్’ దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘ది వాల్ట్ డిస్నీ’తో చేతులు కలిపింది. 35,000 అడుగుల ఎత్తులో ఆకాశ ప్రయాణాన్ని పిల్లలకు సరికొత్త అనుభూతిగా మలిచేందుకు మిక్కీ మౌస్ థీమ్‌తో ప్రత్యేక సేవలందిస్తూ విమానయాన రంగంలో సంచలనం సృష్టిస్తోంది.
ఆకాశంలో డిస్నీ మాయాజాలం
సాధారణంగా సుదీర్ఘ ప్రయాణాలు పిల్లలకు విసుగు తెప్పిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రియాద్ ఎయిర్ సంస్థ డిస్నీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా నెలల వయసు నుంచి 11 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు విమానంలోనే ప్రత్యేకమైన ‘మిక్కీ అండ్ ఫ్రెండ్స్’ థీమ్ కిట్లను అందజేయనున్నారు. ప్రయాణీకులందరికీ వ్యక్తిగత ఆతిథ్యం, అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించినట్లు రియాద్ ఎయిర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఒసామా అల్ నువైసర్ తెలిపారు.
పసిపాపల కోసం ప్రత్యేక జాగ్రత్తలు
నెలల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పసిపిల్లల కోసం ఎయిర్‌లైన్స్ ప్రత్యేకమైన ఇన్‌ఫాంట్ కిట్‌ను సిద్ధం చేసింది. ఇందులో పాల సీసాలు, నిత్యావసరాలను భద్రపరిచేందుకు స్ప్లాష్‌ప్రూఫ్ ఇన్సులేటెడ్ బ్యాగ్, మెత్తటి బిబ్, సెన్సరీ ఫ్లాష్ కార్డ్స్, వెట్ వైప్స్‌తో పాటు చేతుల్లో పట్టుకుని ఆడుకోవడానికి ముద్దులొలికే ‘మిక్కీ మౌస్ ప్లష్ టాయ్’ ఉంటాయి. కొత్త వాతావరణంలో చిన్నపిల్లలు అసౌకర్యానికి గురికాకుండా, తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించేలా ఈ కిట్‌ను రూపొందించారు.
చిచ్చరపిడుగులకు ఆటల వినోదం
3 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారుల కోసం వినోదాన్ని మేళవించిన కిట్లను అందిస్తున్నారు. తక్కువ సమయం ఉండే షార్ట్-హాల్ విమానాల్లో ఆర్ట్ స్క్రోల్, రంగుల పెన్సిళ్లు, పజిల్స్ ఇవ్వనున్నారు. ఇక సుదీర్ఘ ప్రయాణాల్లో (లాంగ్-హాల్) అయితే ప్లష్ బ్యాక్‌ప్యాక్, మాగ్నెటిక్ పజిల్ బాక్స్, పాప్-అప్ కలరింగ్ బోర్డులు, ఆకర్షణీయమైన డిస్నీ బ్యాగ్ ట్యాగ్‌లను అందజేస్తారు. కొత్త ఆట వస్తువులు చేతికి అందడంతో పిల్లలు గంటల కొద్దీ విమాన ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా గడపనున్నారు.
పెద్ద పిల్లలకు స్టైలిష్ ఎంటర్‌టైన్‌మెంట్
7 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు వారి వయస్సుకు తగినట్లుగా స్వతంత్ర భావనను కలిగించే కిట్లను రూపొందించారు. షార్ట్-హాల్ విమానాల్లో టేబుల్‌టాప్ గేమ్‌లు, డ్రాయింగ్ స్క్రోల్స్ అందిస్తుండగా, లాంగ్-హాల్ ప్రయాణాల్లో క్లిప్-ఆన్ ఇయర్‌ఫోన్ హోల్డర్‌తో కూడిన క్రాస్‌బాడీ బ్యాగ్, ‘స్పిన్ అండ్ ప్లే’ గేమ్ స్పిన్నర్, నోట్‌ప్యాడ్, మినీ జెల్ పెన్, ఆకర్షణీయమైన డిస్నీ చార్మ్స్‌ను అందిస్తున్నారు. ఇవి పిల్లలకు సరదాగా కాలక్షేపం చేసేందుకు వీలు కల్పిస్తాయి.
స్క్రీన్‌పై అదిరిపోయే వినోదం..డిస్నీ భోజనం
ఈ డిస్నీ అనుభవం కేవలం గిఫ్ట్ కిట్లతోనే ముగిసిపోదు. విమానంలోని ఇన్‌ఫ్లైట్ స్క్రీన్లపై డిస్నీ, పిక్సర్, మార్వెల్, నేషనల్ జియోగ్రాఫిక్‌లతో పాటు ‘హులు’ కంటెంట్‌ను కూడా ప్రసారం చేయనున్నారు. వీటితో పాటు భోజన సమయంలో పిల్లల ట్రేలపై జారిపోకుండా ఉండే డిస్నీ క్యారెక్టర్ లైనర్లను అందజేస్తూ భోజన విభాగాన్ని కూడా ఆకర్షణీయంగా మార్చారు.
కుటుంబాలకు సరికొత్త జ్ఞాపకాలు
పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే కుటుంబ సభ్యుల ప్రయాణం ఎంతో ప్రశాంతంగా సాగుతుంది. సౌదీ అరేబియా ‘విజన్ 2030’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రయాణీకుల ఆతిథ్యాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో రియాద్ ఎయిర్ ఈ అడుగు వేసింది. గాల్లో ప్రయాణిస్తూ విమానంలో అందుకున్న మిక్కీ మౌస్ బొమ్మ, చూసిన సినిమాలు పిల్లల మదిలో జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనున్నాయి.
ఇది కూడా చదవండి: అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు!


