పిల్లల కథ
పిల్లలూ! ముల్లా నసీరుద్దీన్ పదమూడో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ చమత్కారి. ఆయన కథలు ఎంతో ఫేమస్. ఆయన చేసే పనులు పైకి అమాయకంగా, పిచ్చిగా కనిపించినా, అందులో ఎంతో తెలివి, సమయస్ఫూర్తి, బోలెడంత హాస్యం ఉంటాయి. అలాంటి ముల్లా జీవితంలో జరిగిన ఒక సరదా కథ.
ఒకరోజు ముల్లా నసీరుద్దీన్ ప్రియమైన గాడిద తప్పిపోయింది. ఊరంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. దాంతో ముల్లా బజార్లోకి వచ్చి, గట్టిగా నవ్వుతూ, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఊరి జనాలు అది చూసి ఆశ్చర్యపోయారు.
‘ముల్లా! నీ గాడిద పోతే ఏడవాలి కానీ ఇలా నవ్వుతూ దేవుడికి థాంక్స్ చెప్తున్నావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా?’ అని అడిగారు.
దానికి ముల్లా నవ్వుతూ, ‘అయ్యో పిచ్చి జనులారా! నా ఆనందానికి పెద్ద కారణమే ఉంది. ఆ గాడిద తప్పిపోయినప్పుడు నేను దాని మీద కూర్చొని లేను. ఒకవేళ నేను కూడా దాని మీద కూర్చొని ఉంటే, ఈపాటికి నేను కూడా దాంతోపాటే తప్పిపోయేవాడిని కదా! నన్ను సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను?’ అన్నాడు.
ఇదీ చదవండి: మీకో విషయం చెప్పాలి.. ఆ మూడున్నాయా?
ముల్లా ఇచ్చిన లాజిక్ విని ఊరి జనాలు ముక్కున వేలేసుకుని, గట్టిగా నవ్వేశారు. ఎంతైనా ముల్లా ఆలోచనే వేరు కదూ!


