ప్రతీకాత్మక చిత్రం
ఒకసారి తత్వవేత్త సోక్రటీస్‌ను కలవడానికి ఆయన మిత్రుడు వచ్చి, ‘నీ శిష్యుడు ప్లేటో గురించి ఒక విషయం తెలుసా?’ అని అడిగాడు. ‘ఆగు.. నువ్వు నాకు చెప్పే ముందు చిన్న పరీక్ష. అందులో నువ్వు పాస్ అయితే, ఆ తర్వాత నువ్వు చెప్పాలనుకున్నది చెప్పొచ్చు’ అన్నాడు సోక్రటీస్. వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంతో ‘అదేం పరీక్ష?’ అన్నాడు.
‘మూడు వడపోతల పరీక్ష. ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్. మొదటి వడపోత ‘నిజం’. అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమని నీకు కచ్చితంగా తెలుసా?’ అడిగాడు సోక్రటీస్. ‘లేదు. నేను విన్నానంతే’. ‘అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమో కాదో నీకు తెలియదు. అంతే కదా? సరే... పోనీలే.
నువ్వు అతని గురించి చెప్పబోయేది ఏదైనా ‘మంచి’ విషయమా?’ ‘అది చెడు విషయం.’ ‘చెప్పబోయే విషయం నిజమో, అబద్ధమో కూడా తెలియకుండా అతని గురించి తప్పుగా చెప్పబోతున్నావన్న మాట!’ దీంతో ఆ వ్యక్తి ఇరకాటంలో పడ్డాడు.
ఇదీ చదవండి: ఎదుటివారి సంతోషాన్ని చూసి సంతోషించగలరా?
‘సరే. మరో వడపోత కూడా ఉంది. ఇందులో పాస్ అయినా నాకు చెప్పొచ్చు. నువ్వు చెప్పబోయే విషయం వల్ల నాకు ఏమైనా ‘ఉపయోగం’ ఉంటుందా?’ ‘లేదు... అలాంటిదేమీ లేదు’.
‘అది నిజమో కాదో తెలియదు. అది మంచి విషయం కాదు. దాన్ని నాకు చెప్పడం వల్ల ఉపయోగమూ లేదు. అటువంటప్పుడు ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? మరేదైనా మాట్లాడుకుందాం!’ అన్నాడు సోక్రటీసు.
– యామిజాల జగదీశ్


