తెలంగాణలో 56 కేంద్రాల్లో పరీక్ష
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 17,626 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 17,143 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంతో 97.26 శాతం హాజరు నమోదైంది. అన్ని కేంద్రాల్లో పరీక్ష సజావుగా జరిగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరీక్ష నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ప్రవేశం, సాంకేతిక ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో దేశవ్యాప్తంగా ఒకే విడతలో పరీక్ష జరిగింది. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, పరీక్ష నిర్వహణ సంస్థల సమన్వయంతో కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా సాంకేతిక లేదా నిర్వహణాపరమైన సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.


