ఉమెన్ పవర్
‘మనసే సర్వస్వం. మీరు ఏది అనుకుంటారో అదే అవుతారు’ అనేది బౌద్ధ వాక్కు. కడు పేదరికంలో పుట్టినప్పటికీ... విఠల్ బాలకృష్ణ గాంధీ కలలు కన్నారు. కష్టపడి కలలు నిజం చేసుకున్నారు. దేశం గర్వించదగిన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆయన మనవరాలు లీనా తివారి గాంధీ భారత ఫార్మస్యూటికల్ రంగంలో విశిష్ఠ స్థానాన్ని సాధించారు. తాత అడుగు జాడల్లో నడవడమే కాదు... ఆయన ఆశయాలనూ ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా... ‘ఫోర్బ్స్ ఇండియా రిచెస్ట్–100’ జాబితాలో చోటు సాధించారు...
ముంబై యూనివర్శిటీలో బీకామ్, బోస్టన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు లీనా గాంధీ. ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీ 1961లో ‘యూఎస్‌వీ’ కంపెనీని స్థాపించారు. తాత అడుగు జాడల్లో నడిచిన లీనా ఆ కంపెనీని మరింత ఉన్నతస్థానంలో నిలిపారు.
మొదట్లో ‘యూఎస్‌వీ’ అనేది మందులను దిగుమతి చేసుకునే కంపెనీ మాత్రమే. ఆ కంపెనీని మందుల తయారీ కంపెనీగా మార్చిన ఘనత లీనాకు దక్కుతుంది. అలా మార్చడం ఆమె భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. కంపెనీని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లారు లీనా.
దాతృత్వంలోనూ...
ఎన్నో విజయాలతో భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు లీనా గాంధీ. ఆర్థిక విజయాలలోనే కాదు దాతృత్వ విషయాలలోనూ ఆమెకు మంచి పేరు ఉంది. హురున్ ఇండియా ఫిలాంత్రోపిస్ట్ జాబితాలలో లీనా మూడవ స్థానంలో నిలిచారు.
రచయిత్రి కూడా...
కార్పొరెట్ ప్రపంచానికి ఆవల లీనా గురించి చెప్పుకోవాలంటే... ప్రకృతి అంటే ప్రాణం. పుస్తకాలు బాగా చదువుతారు. రచనలు కూడా చేస్తుంటారు.
తాతగారి జీవిత చరిత్రను ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్–ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలకృష్ణ గాంధీ’ పేరుతో పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం రాయడం కోసం ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. ఎంతోమంది వ్యక్తులతో మాట్లాడారు. విఠల్ బాలకృష్ణ గాంధీ మార్గాన్ని అనుసరించారు. నిరుపేదగా మురికివాడ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన కష్టపడే స్వభావంతో ఉన్నత స్థానానికి చేరారు.
మహారాష్ట్రలోని రత్నగిరిలో పేద, నిరక్షరాస్య కూరగాయల వ్యాపారి ఇంట్లో పుట్టారు విఠల్ బాలకృష్ణ. అవకాశాలు పరిమితం... ఎటు చూసినా పేదరికం. అయినప్పటికీ ఎప్పుడూ కలలు కనడం మానలేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విఠల్ బాలకృష్ణ, గాంధీ సందేశాలను ప్రజలకు చేరవేసేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షత వహించారు. రాజకీయాల్లోనే కాదు ‘యూఎస్‌వీ లిమిటెడ్’ అనే ఫార్మస్యూటికల్ కంపెనీతో పారిశ్రామికవేత్తగా కూడా విజయం సాధించారు.
దారిదీపాలు
తాతగారి జీవిత చరిత్రను తానే స్వయంగా రాయడం మాట ఎలా ఉన్నా... ఆ పుస్తకం రాసే క్రమంలో తనను తాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం లీనా తివారీకి వచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు తాత ఎలా ధైర్యంగా నిలబడ్డారు? ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి సానుకూల శక్తితో ఎలా ముందుకు వెళ్లారు? అనుకోని సమస్యలు ఎదురైతే, తానే ట్రబుల్ షూటర్‌గా ఎలా మారారు?... ఇలాంటి విషయాలు ఎన్నో లీనా తివారి జీవన ప్రయాణంలో దారిదీపాలుగా మారాయి.
లీనా–ప్రశాంత్ తివారి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారికి వన్య్రపాణులు అంటే ఇష్టం. సాహస యాత్రలలో చురుగ్గా పాల్గొంటారు. అనీషా గాంధీ తల్లికి తగిన తనయ. బ్రౌన్ యూనివర్శిటీలో బయో కెమిస్ట్రీ, యంఐటీ నుండి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్‌డీ చేసింది.
ఒక్కమాటలో చెప్పాలంటే...
లీనా తివారి అంటే... వృత్తిపరమైన విజయాలను, సామాజిక బాధ్యతలతో ఎలా మేళవించవచ్చో ప్రపంచానికి చాటిన విజేత.
మహిళలకు అండగా...
పారిశ్రామికవేత్తగా సుపరిచితురాలైన లీనా తివారి సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. ‘డాక్టర్ సుశీల గాంధీ నిరుపేదల మహిళల కేంద్రం’ అనే స్వచ్ఛంద సంస్థకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఈ సంస్థ నిరుపేద బాలికలు, యువతులకు విద్యాపరమైన సేవలు అందిస్తోంది. కళాశాల విద్య కోసం ఆర్థిక సహాయం చేస్తోంది. అర్హులైన మహిళలకు తన కంపెనీలో ఉన్నత స్థానం ఇవ్వడంలో ముందుంటారు లీనా తివారి. ‘మా కంపెనీలోని కొన్ని విభాగాలలో మహిళలే ఎక్కువగా ఉన్నారు’ అని గర్వంగా చెబుతుంటారు లీనా.
ఆత్మవిశ్వాసం అంటే...
ఆత్మవిశ్వాసం అంటే గట్టిగా అరవడం కాదు. ఆడంబరం కాదు. మనపై మనకు గట్టి నమ్మకం ఉండడం. నాలో ఆత్మవిశ్వాసం రాత్రికి రాత్రి రాలేదు. నేను ధైర్యంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు, సమస్యలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు, నాపై నాకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం నాలో పెరుగుతూ వచ్చింది.
– లీనా తివారి గాంధీ


