ఫరీద్‌కోట్: పంజాబ్‌లో ఫరీద్‌కోట్ ప్రాంతంలో మండుటెండలో మనవరాలి పట్ల మహిళా ఏఎస్‌ఐ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల మనవరాలి చేతులు, కాళ్లు కట్టేసి.. గేటుకి కట్టేసిన ఏఎస్‌ఐ సరబ్‌జిత్ కౌర్ క్రూరంగా వ్యవహరించింది. ఎండలో ఆ చిన్నారి ఏడుస్తూ.. నరకం అనుభవిస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీస్ అధికారులు.. సరబ్‌జిత్‌ని సస్పెండ్ చేశారు.
ఆ చిన్నారి చేతులు, కాళ్లను గుడ్డతో గేటుకు కట్టేయడంతో.. ఆ పాప తట్టుకోలేక ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాప ఏడుపు విన్న పొరుగువారు అక్కడికి చేరుకుని.. ఆ దారుణాన్ని వీడియో తీయడమే కాకుండా.. వెంటనే ఆ చిన్నారిని విడిపించి రక్షించారు.
ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం పోర్చుగల్‌లో నివసిస్తున్నారు. పాపను ఆమె అమ్మమ్మ సంరక్షణలో వదిలి వెళ్లారు. నిందితురాలు ఏఎస్‌ఐ సరబ్‌జిత్ కౌర్ ఫరీద్‌కోట్‌లో 'మహిళా మిత్ర' (మహిళా హెల్ప్‌డెస్క్) విభాగంలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ తర్లోచన్ సింగ్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఉండి కూడా ఆ చిన్నారిని ఎండలో కట్టేసి వదిలేయడం అత్యంత అమానవీయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కౌర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా.. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు.


