సులేమానీ కోడలు, మనవరాలిని అరెస్టు చేసిన అమెరికా  | USA arrests relatives of slain Iranian general Soleimani | Sakshi
Sakshi News home page

సులేమానీ కోడలు, మనవరాలిని అరెస్టు చేసిన అమెరికా 

Apr 5 2026 4:54 AM | Updated on Apr 5 2026 4:54 AM

USA arrests relatives of slain Iranian general Soleimani

వారి గ్రీన్‌కార్డులు రద్దు 

వాషింగ్టన్‌: ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) మాజీ చీఫ్‌ ఖాసీం సులేమానీ కోడలు, మనవరాలిని అమెరికా అదుపులోకి తీసుకుంది. ‘‘విదేశాంగ శాఖ శుక్రవారం వారి గ్రీన్‌ కార్డులను రద్దు చేసింది. ఆ వెంటనే వారిద్దరినీ లాస్‌ ఏంజెలీస్‌లో అరెస్టు చేశాం. వారు ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అదుపులో ఉన్నారు’’అని విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం వెల్లడించారు. ‘‘సులేమానీ కోడలు అఫ్సర్, మనవరాలు లాస్‌ ఏంజెలెస్‌లో చాలా ఏళ్లుగా విలాస జీవితం గడుపుతున్నారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమెరికా వ్యతిరేక దాడులను బాహాటంగా సమర్థిస్తూ వస్తున్నారు.

 అమెరికాను సైతాన్‌ దేశంగా అఫ్సర్‌ అభివరి్ణంచారు!’’అని ఎక్స్‌ పోస్టులో ఆయన దుయ్యబట్టారు. అమెరికా వ్యతిరేక ఉగ్రవాద దేశాలకు మద్దతిచ్చే వారికి తమ గడ్డను వేదిక కానివ్వబోమన్నారు. సులేమానీ 2020లో అమెరికా వైమానిక దాడుల్లో మరణించడం తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఇరాన్‌ మాజీ జాతీయ భద్రతా సలహాదారు అలీ లారిజానీ కూతురు ఫాతిమా అర్దెషిర్, ఆమె భర్త వీసాలను కూడా కొంతకాలం క్రితమే అమెరికా రద్దు చేసింది. గత డిసెంబర్‌ నుంచి పలువురు ఇరాన్‌ దౌత్యవేత్తలకు వీసాల జారీని కూడా నిరాకరిస్తూ వస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement