చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్‌లో చిక్కుకుపోయిన 345 మంది భారతీయ మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం వీరంతా చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజులుగా పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌లో చిక్కుకున్న మన మత్స్యకారులను రక్షించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. వారిని ఆర్మేనియా మీదుగా విజయవంతంగా భారత్‌కు తరలించింది. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి, మత్స్యకారుల తరలింపునకు సహకారం అందించిన ఆర్మేనియా ప్రభుత్వానికి, ఆ దేశ విదేశాంగ మంత్రి అరరత్ మీర్జోయాన్‌కు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియాలో సంఘర్షణ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 1,500 మందికి పైగా భారతీయులు ఇరాన్ సరిహద్దుల గుండా ఆర్మేనియా, అజర్‌బైజాన్ మార్గాల ద్వారా సురక్షితంగా భూమార్గం గుండా బయటపడ్డారు. గల్ఫ్ దేశాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రవాస భారతీయుల భద్రత, రక్షణ తమకు ముఖ్యమని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం అబుదాబిలో జరిగిన ఒక దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. శత్రువుల క్షిపణిని గాల్లోనే అడ్డుకున్న సమయంలో, దాని శకలాలు కింద పడి మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు మన దేశానికి చెందిన పౌరులు ఉన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన అబుదాబిలోని భారత ఎంబసీ, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు వైద్య సహాయం అందిస్తోంది. గాయపడిన ఐదుగురిలో నలుగురు ఇప్పటికే కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని భారత ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: కువైట్‌లో ఉద్రిక్తత: ఆయిల్ కాంప్లెక్స్‌పై భీకర డ్రోన్ దాడి


