కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్‌లోని అత్యంత కీలకమైన చమురు కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామున అనూహ్య డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
కువైట్ చమురు మంత్రిత్వ శాఖతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీఎస్) ప్రధాన కార్యాలయాలున్న షువైక్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కువైట్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంధన మౌలిక సదుపాయాలకు మరింత నష్టం వాటిల్లకుండా అడ్డుకున్నారు. శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే దీటుగా అడ్డుకుంటున్నాయని కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఈ దాడులను విజయవంతంగా ఛేదిస్తున్న క్రమంలోనే నగరమంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని సైన్యం ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది.
ప్రభుత్వ భవనంపై ఇరాన్ దాడి
శనివారం సాయంత్రం కూడా కువైట్ సిటీలోని ఒక ప్రభుత్వ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఫలితంగా భవనానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడికి గురైన కాంప్లెక్స్ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఆదివారం ఇంటి నుంచే (రిమోట్ వర్క్) పనిచేయాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా భవనాల్లోకి సందర్శకులకు అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే.. ఇరాన్ ఇప్పుడు కువైట్ సహా పలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
BREAKING: Kuwait’s Ministry of Oil building has been hit in an Iranian attack.
Large fire reported at the ministry complex in Shuwaikh.
The ministry runs Kuwait’s entire oil sector. Iran is now hitting the buildings that set Gulf oil policy, not just the facilities that produce… pic.twitter.com/OYtFUHb88Y— The Hormuz Letter (@HormuzLetter) April 4, 2026


