డెహ్రాడూన్: మ్యాగీ ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల తీవ్ర కొరత, ఆకాశాన్నంటిన ధరల కారణంగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ - ముస్సోరీ మార్గంలో పర్యాటకులతో ఎప్పుడూ కిటకిటలాడే ఫేమస్ ‘మ్యాగీ పాయింట్లు’ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చిరు వ్యాపారుల మనుగడ అత్యంత కష్టంగా మారింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక వ్యాపారులు కట్టెల పొయ్యిల వైపు మొగ్గుచూపుతున్నారు. కట్టెల మీద వంట ఆలస్యం కావడంతో, ఆర్డర్ల కోసం గంటల తరబడి వేచి చూడలేక కస్టమర్లు వెనుదిరుగుతున్నారు.
కేవలం రోడ్డు పక్కన ఉండే మ్యాగీ పాయింట్లే కాకుండా.. డెహ్రాడూన్ వ్యాప్తంగా ఉన్న దాబాలు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు కూడా ఈ గ్యాస్ కొరతతో అల్లాడుతున్నాయి. ‘కమర్షియల్ గ్యాస్ అసలు దొరకడం లేదు. నిబంధనల ప్రకారం ఇళ్లలో వాడే డొమెస్టిక్ సిలిండర్లను మేము ఉపయోగించలేం. కస్టమర్ల ఆర్డర్లు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం. వ్యాపారం దెబ్బతిన్నా కస్టమర్లను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో పాత ధరలకే ఆహారాన్ని అందిస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నాం’ అని షాను రాణా అనే మ్యాగీ పాయింట్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కమర్షియల్ ఎల్‌పీజీ పంపిణీ కోసం శుక్రవారం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. పౌరసరఫరాల శాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించినందుకు రాష్ట్రానికి అదనంగా ఆరు శాతం కోటా దక్కింది. దీంతో కేంద్రం ఇచ్చే 20 శాతంతో కలుపుకుని రాష్ట్ర మొత్తం కోటా 40 నుంచి 66 శాతానికి పెరిగింది. రాబోయే చార్‌ధామ్ యాత్ర, పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రోజువారీగా 6,310 సిలిండర్లను పంపిణీ చేయనున్నారు.
పెళ్లిళ్లకు ప్రత్యేక కోటా
పెళ్లిళ్లకు కూడా రోజుకు 660 సిలిండర్ల (10%) ప్రత్యేక కోటా ఏర్పాటు చేశారు. అయితే జిల్లా మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతితో ఒక్కో ఈవెంట్‌కు గరిష్టంగా రెండు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఇస్తారు. ఈ వివాహ కోటాలో డెహ్రాడూన్, నైనిటాల్ జిల్లాలకు అత్యధికంగా 176 చొప్పున సిలిండర్లు లభించనున్నాయి. పారిశ్రామిక కేటాయింపులు ఎక్కువగా డెహ్రాడూన్, హరిద్వార్, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలకు పరిమితమయ్యాయి.
ఇది కూడా చదవండి: దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!


