దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం! | Sabarimala gold theft not isolated multiple temple losses in Kerala | Sakshi
Sakshi News home page

దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!

Apr 5 2026 9:20 AM | Updated on Apr 5 2026 9:20 AM

Sabarimala gold theft not isolated multiple temple losses in Kerala

తిరువనంతపురం: శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది.

కొచ్చికి చెందిన ఆర్టీఐ కార్యకర్త కె. గోవిందన్ నంబూతిరి దాఖలు చేసిన దరఖాస్తుకు.. కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని త్రిస్సూర్ గ్రూప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానాలతో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. గతంలో శబరిమల ఆలయంలో వెలుగుచూసిన ఆరోపణల మాదిరిగానే.. ఇప్పుడు త్రివేండ్రంలోని శ్రీవరాహం ఆలయం, కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని పుల్లు భగవతి ఆలయం, త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయాల నుంచి స్వామివారి బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.

ఏ గుడిలో ఎంత మాయమైందంటే..
పుల్లు భగవతి ఆలయం: కొచ్చిన్ దేవస్వం బోర్డు త్రిస్సూర్ గ్రూప్ కిందకు వచ్చే ఈ గుడిలో ఏకంగా 40.50 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు అదృశ్యమయ్యాయి.
శ్రీవరాహం ఆలయం: ఇక్కడ 7.750 గ్రాముల బరువున్న రెండు పురాతన బంగారు గొలుసులు కనిపించలేదు. త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయం: ఈ ప్రసిద్ధ ఆలయంలో స్వామివారి కిరీటం నుంచి 663 మిల్లీగ్రాముల బంగారం మాయమైంది.

నిర్వహణలో డొల్లతనం
పలు దేవస్వం బోర్డు ఆలయాల్లో స్వామివారి ఆభరణాలకు (తిరువాభరణం) సంబంధించి కనీస రిజిస్టర్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిల్వల ట్రాకింగ్‌లో ఉన్న లోపాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కాగా శబరిమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద మంజూరు చేసిన నిధుల వినియోగంపై కూడా నంబూతిరి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టీఐ పత్రాల ప్రకారం.. కేంద్రం రూ.46.53 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement