న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసే అత్యవసర చర్యల్లో భాగంగా, ఈ వేసవిలో (ఏప్రిల్ - జూన్ 2026 మధ్య) ‘క్లౌడ్ సీడింగ్’ ప్రయోగాలను నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రయోగాల కోసం ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కోరింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఢిల్లీ పర్యావరణ శాఖ, ఐఐటీ కాన్పూర్ మధ్య 2025 సెప్టెంబర్ 25న ఒక కీలక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు ప్రయోగాలు నిర్వహించినప్పటికీ నగరంలో వర్షం కురవలేదు.
మేఘాల్లో తేమ శాతం తక్కువగా (కేవలం 15 నుంచి 20 శాతమే) ఉండటం కారణంగానే నాటి ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. అయితే ఆ వైఫల్యం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు పనికొచ్చే కీలక వాతావరణ పరిస్థితుల గురించి నేర్చుకున్నామని తెలిపింది.
క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి?
మేఘాల నుంచి వర్షం పడే అవకాశాలను కృత్రిమంగా పెంచే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ వంటి రసాయనాలతో కూడిన ఫ్లేర్లను వదులుతారు. ఇవి మేఘాల్లో మంచు స్ఫటికాలు లేదా నీటి బిందువులు త్వరగా ఏర్పడేలా చేసి, వర్షం కురిసేలా చేస్తాయి. దీనివల్ల గాలిలోని కాలుష్య కణాలు కిందికి చేరి గాలి శుభ్రపడుతుంది.
గత అక్టోబర్ ప్రయోగాల వల్ల వర్షం పడకపోయినా, లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో కాలుష్య కారకాలు (పర్టిక్యులేట్ మ్యాటర్) తగ్గాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. ఇటీవలే విడుదలైన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఢిల్లీ 2025-26’ సైతం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సహకారంతో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చేయబోయే ఈ ప్రయోగం సక్సెస్ అయి, ఢిల్లీవాసులకు కాలుష్యం నుంచి ఊరటనిస్తుందేమో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం


