Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం | Over 30 universities hit by US Israeli strikes | Sakshi
Sakshi News home page

Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం

Apr 5 2026 10:53 AM | Updated on Apr 5 2026 10:53 AM

Over 30 universities hit by US Israeli strikes

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఏకంగా 30కి పైగా విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ స్వయంగా వెల్లడించారు. విద్యా, వైద్య కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఉత్తర టెహ్రాన్‌లోని ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు పశ్చిమాన ఉన్న ‘మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో క్యాంపస్ భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 1960లో స్థాపించిన ఈ వర్సిటీ వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఓ కీలక కేంద్రం. దాడితో దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం మంత్రి సర్రాఫ్ పరిశీలించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా వర్సిటీలపై దాడులు జరిగాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఆస్పత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘన చరిత్ర కలిగిన బయోమెడికల్ కేంద్రం ‘పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా దాడులు జరిగాయని, భవనాలు భారీగా దెబ్బతినడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దాడి జరిగినప్పటికీ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి నిరంతరాయంగానే కొనసాగుతున్నాయని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ఆరోగ్య శాఖ, ఐఎస్‌ఎన్‌ఏ వార్తా సంస్థ  తెలిపాయి.

ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయని, వాటికి తక్షణ సాయం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ భీకర పోరు కారణంగా ఆయా దేశాల్లో ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలసబాట పట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి: మ్యాగీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement