వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, అంతర్జాతీయంగా ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌పై విజయం సాధించాం. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా సైన్యం భారీ దాడిలో హతమయ్యారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టుతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి. అయితే, వీడియో విషయంలో స్పష్టత లేకపోవడం, ఎక్కడ దాడి జరిగిందనే విషయాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దాడి ఎలా జరిగింది? లక్ష్యాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, ఆ వీడియో నిజంగా ఇరాన్‌పై దాడికి సంబంధించదేనా? అనే విషయంపై అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు.
ఏం జరగనుంది?
మరోవైపు.. ఇరాన్‌పై ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్‌కు 48 గంటల గడువు ఇస్తూ, ఈలోగా ఒప్పందం చేసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిర్ణయం తీసుకోకపోతే భయంకర పరిణామాలు ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM EST
Many of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026
కాగా, గతంలో కూడా ట్రంప్ ఇరాన్‌కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇంధన ప్లాంట్లపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా చెప్పారు. అయితే తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. చర్చలు సాగుతున్నాయన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా కఠిన హెచ్చరికల దిశగా అమెరికా మళ్లింది.
ఇరాన్ కౌంటర్..
ఇదిలా ఉండగా.. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. ఈ క్రమంలో ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ తరఫున జనరల్ అలీ అబ్దొల్లాహి అలియాబాదీ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తోందన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్ ఆత్రుతతో వ్యాఖ్యలు చేశారని కౌంటరిచ్చారు. కాగా, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశం రెండు దేశాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో దీనిపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.


