భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే? | Actress Shanthi Priya Angry on Rumours about Bhanu Priya | Sakshi
Sakshi News home page

డిప్రెషన్‌లో భానుప్రియ.. అక్క ఇకపై సినిమాలు చేయదు: శాంతిప్రియ

Apr 4 2026 12:44 PM | Updated on Apr 4 2026 1:08 PM

Actress Shanthi Priya Angry on Rumours about Bhanu Priya

ఆకట్టుకునే ఆహార్యం, అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది హీరోయిన్‌ భానుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సూపర్‌ హిట్‌ సినిమాలు చేసింది. అయితే భర్త మరణించాక తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె డిమెన్షియా అనే వ్యాధి బారిన పడింది. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం!

భానుప్రియ గురించి దుష్ప్రచారం
ఈ వ్యాధి వల్ల డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి, హీరోయిన్‌ శాంతిప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అక్క కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. తీరా చిత్రీకరణ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పుచేర్పులు చేస్తున్నారు.

ఇలా మోసం చేయడం సరికాదు
అది ఆమెను బాధిస్తోంది. ముందొకటి చెప్పి.. తీరా సెట్‌కు వెళ్లాక మాట మార్చేయడం పట్ల ఆమె ఎంతగానో కలత చెందింది. దాదాపు 280 సినిమాలు చేసి, ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి పరిస్థితిలో నా సోదరిని చూడలేకపోతున్నాను. భర్త చనిపోయాక అక్క మానసికంగా కుంగిపోయింది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. తనను కనీసం 80's స్టార్స్‌ రీయూనియన్‌కు కూడా ఎవరూ ఆహ్వానించరు.

రీయూనియన్‌కి పిలవరు
దీని గురించి మాట్లాడొద్దని అక్క నన్ను హెచ్చరించింది, అయినా సరే నిర్మొహమాటంగా చెప్తున్నా.. తనను ఎవరూ రీయూనియన్‌ పార్టీకి పిలవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.. పోనీ తన నెంబర్‌ మీ దగ్గర లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్‌ చేయొచ్చుగా.. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. కానీ ఎవరూ సంప్రదించరు. ఇకపోతే అక్క ఇకపై సినిమాలు చేయదు. నేను మాత్రం సినిమాల్లో కొనసాగుతాను. 

నాకోసం డబ్బింగ్‌
బ్యాడ్‌ గర్ల్‌ సినిమాలో అక్క నాకోసం డబ్బింగ్‌ చెప్పింది. తన మానసిక స్థితి చెడిపోలేదు. బాగానే ఉంది. దయచేసి సోషల్‌ మీడియాలో అక్క గురించి అసత్య ప్రచారం వ్యాప్తి చేయొద్దు. యూట్యూబ్‌లో ముందూవెనకా ఆలోచించకుండా, ఏదీ తెలుసుకోకుండా అక్క గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని మండిపడింది. కాగా భానుప్రియ.. సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బంగారు చిలక, అన్వేషణ, ఆలాపణ, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా.. ఇలా అనేక సినిమాలు చేసింది. 

పర్సనల్‌ లైఫ్‌
చివరగా అయలాన్‌ మూవీలో హీరో తల్లిగా కనిపించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. భానుప్రియ 1998లో గ్రాఫిక్స్‌ ఇంజనీర్‌ ఆదర్శ్‌ కౌశల్‌ను పెళ్లాడింది. వీరికి 2002లో కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో చదువుకుంటోంది. పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకోలేదు. 2018లో ఆదర్శ్‌ గుండెపోటుతో మరణించాడు.

చదవండి: నేను కాలితో తన్నడం వల్ల అనుష్కకు గాయం: అడివి శేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement