చుట్టూ వారు మన ఏజ్‌ బారు | People who behave with a negative attitude tend to age quickly | Sakshi
Sakshi News home page

చుట్టూ వారు మన ఏజ్‌ బారు

Apr 5 2026 4:40 AM | Updated on Apr 5 2026 4:40 AM

People who behave with a negative attitude tend to age quickly

శరీర ఆరోగ్యంపైనా మన చుట్టూ ఉండే వారి ప్రభావం 

ప్రతికూల ధోరణితో ప్రవర్తించే వ్యక్తులతో త్వరగా వృద్ధాప్య ఛాయలు 

టాక్సిక్‌ వ్యక్తులతో వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరిగే చాన్స్‌ 

బయోలాజికల్‌ వయసు సగటున 9నెలలు ఎక్కువగా 

కన్పిస్తున్న వైనం.. అమెరికన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మన చుట్టూ ఉండే వ్యక్తులు మన మనసుపై మాత్రమే కాదు, శరీర ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతారని నిపుణులు ఎప్పటినుంచో చెబుతుండగా.. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరుస్తోంది. ఎప్పుడూ ఒత్తిడి కలిగించే లేదా ప్రతికూల (నెగెటివ్‌) ధోరణితో ప్రవర్తించే (టాక్సిక్‌) వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు బ్యుంక్యులీ సారథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్‌ ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (పీఎన్‌ఏ)లో ప్రచురితమయ్యాయి. 

అధ్యయనంలో భాగంగా 18–104 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2300 మందికి పైగా వ్యక్తులను పరిశీలించారు. వారి సామాజిక సంబంధాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్‌వర్క్‌ను విశ్లేషించారు. ముఖ్యంగా ఎవరి వల్ల ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడికి గురవుతున్నారో లేదా సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించారు. పాల్గొన్న వారి లాలాజలం నమూనాలను తీసుకుని డీఎన్‌ఏ మైథెలేషన్‌ అనే విధానం ద్వారా ‘బయోలాజికల్‌ ఏజ్‌’ను కొలిచారు. సాధారణంగా మన పుట్టిన తేదీ ఆధారంగా చెప్పే వయసు క్రోనాలాజికల్‌ ఏజ్‌ కాగా, శరీర కణాల స్థితి ఆధారంగా చెప్పే వయస్సును బయోలాజికల్‌ ఏజ్‌ అంటారు. ఇది ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్న మాట. 

అధ్యయనం తేల్చిన కీలకాంశాలివే.. 
ఒక వ్యక్తి జీవితంలో కీలకంగా లేదా అత్యంత సన్నిహితంగా ఎవరైనా టాక్సిక్‌ వ్యక్తి ఉంటే వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరుగుతుంది. అటువంటి సంబంధాలు ఉన్నవారి బయోలాజికల్‌ వయస్సు సగటున 9 నెలలు ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉన్న నెగటివ్‌ సంబంధాలు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపాయని పరిశోధకులు గుర్తించారు. టాక్సిక్‌ వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడికి (క్రానిక్‌ స్ట్రెస్‌)కు కారణమవుతారు. దీనివల్ల కార్టిసోల్‌ వంటి హార్మోన్లు పెరిగి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది కణాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి వాటికి కారణమై అంతిమంగా వేగవంతమైన వృద్ధాప్యం ప్రాప్తించేందుకు కారణమవుతుంది. 

మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం... 
టాక్సిక్‌ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిరాశ, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో నిద్రలేమి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా మీద పడవచ్చు. మన చుట్టూ ఉన్న సంబంధాలు భావోద్వేగాలపై అంతిమంగా శరీర వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.  

సానుకూల సంబంధాలే ఆరోగ్యానికి మేలు 
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మంచి సంబంధాలు కలిగి, మద్దతు ఇచ్చే వ్యక్తులతో కలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే టాక్సిక్‌ వ్యక్తులతో సంబంధాలను తగ్గించుకుని సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. నెగటివ్‌ ఆలోచనలతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం, అవసరమైన చోట భావోద్వేగ హద్దులు పెట్టుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటి కార్యకలాపాలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని, సానుకూల ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement