ఆర్థిక ఇబ్బందుల్లేకుంటే కారుణ్య ఉద్యోగానికి అర్హులు కారు | High Court orders on compassionate employment | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లేకుంటే కారుణ్య ఉద్యోగానికి అర్హులు కారు

Apr 5 2026 4:33 AM | Updated on Apr 5 2026 4:33 AM

High Court orders on compassionate employment

దీర్ఘకాలం జీవనం సాగించిన తర్వాత ఉత్తర్వులివ్వలేమన్న హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో లేకున్నా, అతను లేకుండా దీర్ఘకాలంగా జీవనం సాగిస్తున్నా వారు కారుణ్య ఉద్యోగానికి అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఎంజీఎం ఆస్పత్రిలో మేల్‌ నర్స్‌గా పని చేసి మరణించిన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలంటూ వరంగల్‌కు చెందిన ఓ యువతి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తిరస్కరించడంతో, ఆకస్మిక ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం చాలా కాలం జీవనం సాగించిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లేవంటూ పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టివేశారు. పిటిషనర్‌ తల్లి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రికి చట్టబద్ధమైన వారసురాలిగా పొందిన సివిల్‌ డిక్రీ కేవలం ఆస్తి విషయాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి చట్టపరమైన హక్కు కల్పించదని చెప్పారు. 

దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారంటూ ఆ ఉత్తర్వులను సమర్థించింది. ఉద్యోగం కోసం చేసిన మొదటి దరఖాస్తును సరైన కారణాలతో తిరస్కరించారని పేర్కొంది. ఐదేళ్ల తర్వాత రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement