రెస్పెక్ట్‌ ఏదిరా? | 10th graders brutally beat up 9th grader: Telangana | Sakshi
Sakshi News home page

రెస్పెక్ట్‌ ఏదిరా?

Apr 5 2026 4:27 AM | Updated on Apr 5 2026 4:27 AM

10th graders brutally beat up 9th grader: Telangana

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న తల్లిదండ్రులు

9వ తరగతి విద్యార్థులను చితకబాదిన టెన్త్‌ విద్యార్థులు

గంగాధర జ్యోతిబాఫూలే గురుకులంలో దారుణం

గంగాధర: తమకు గౌరవం ఇవ్వ­డం లేదని పదో తరగతి విద్యార్థు­లు 9వ తరగతి విద్యార్థులను చిత­కబాదారు. కరీంనగర్‌ జిల్లా గంగా­ధరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల విద్యా­లయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. శుక్రవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత వాచ్‌­మన్, డ్యూటీలో ఉండే ఉపాధ్యా­యుడు నిద్రపోయారు. పదో తర­గతి విద్యార్థులు 25 మంది కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మందిని, ఒక్కొక్కరిగా తమ గదిలోకి పిలుస్తూ చితకబాదారు. దెబ్బలు తిన్న విద్యా­ర్థు­లు శనివారం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

దెబ్బలు తిన్న వారిలో ఓ విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. శనివారం అతని తల్లి పాఠశాలకు వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధిత విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాలకు చేరుకోగా, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ వంశీకృష్ణ, పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. బాధిత విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇద్దరిని కరీంనగర్‌ తరలించారు.

అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై తహసీల్దార్‌ అంబటి రజితకు ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్నా డ్యూటీలో ఉన్న వాచ్‌మన్, ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తహసీల్దార్‌ రజిత విచారణ చేపట్టి దాడి చేసిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. వాచ్‌మన్, ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఉన్న­తాధికారులకు సిఫారసు చేశారు.

గదిలో బంధించి ర్యాగింగ్‌
7వ తరగతి విద్యార్థిని కొట్టిన టెన్త్‌ విద్యార్థులు
కారేపల్లి: గురుకులం విద్యార్థులు సాయంత్రం వేళ ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ ఏడో తరగతి విద్యార్థిపై దాడికి దారితీసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం సాయంత్రం కొందరు పదో తరగతి విద్యార్థులు ఓ గదిలో 7వ తరగతి విద్యార్థిని బంధించి ర్యాగింగ్‌ చేస్తూ దాడికి పాల్పడ్డారు.

ఈ సమయాన ఉపాధ్యాయులెవరూ లేకపోగా, విద్యార్థి అరుపులు విన్న సమీపంలోని డబుల్‌ బెడ్‌రూం వాసులు చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. గాయపడిన విద్యార్థిని 108 అంబులెన్స్‌లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చేరుకున్న విద్యార్థి కుటుంబీకులు, స్థానికులు దాడి చేసిన టెన్త్‌ విద్యార్థులను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు చేరుకుని 10వ తరగతి విద్యార్థులను ఓ గదిలో ఉంచి.. ఉదయం మాట్లాడదామని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement