ఔషధాలపై యుద్ధం దెబ్బ | Medicine makers see sharp rise in prices due to war: Telangana | Sakshi
Sakshi News home page

ఔషధాలపై యుద్ధం దెబ్బ

Apr 5 2026 3:50 AM | Updated on Apr 5 2026 4:06 AM

Medicine makers see sharp rise in prices due to war: Telangana

900 రకాల అత్యవసర మందుల ధరలు 20 నుంచి 200 శాతం పెరిగే అవకాశం 

చైనా, పశ్చిమాసియా నుంచి వచ్చే ముడిసరుకుల ధరలు 200 నుంచి 300 శాతం పెరిగిన వైనం

జ్వరం నుంచి హృద్రోగ, కేన్సర్‌ మందుల వరకు ధరలు జంప్‌

ఇప్పుడున్న స్టాక్‌ పూర్తయితే పెరిగే ధరలతో కొత్త స్టాక్‌

ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా కష్టమే అంటున్న సప్లయర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమాసియాలో యుద్ధం ఔషధ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. మందుల తయారీలో వినియోగించే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియంట్‌ (ఏపీఐ)తోపాటు సాల్వెంట్స్, ఎక్సిపియెంట్స్‌ ముడిసరుకుల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగాయి. వీటికితోడు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఏటా చేసే ధరల సాధారణ సవరణతో ఈనెల నుంచి 760కి పైగా మందుల ధరలు 0.65 శాతం పెరిగాయి. దీంతో 900కు పైగా అత్యవసర ఔషధాల ధరలు 20 నుంచి 200 శాతం వరకు పెరగబోతున్నాయి. ఇది సామాన్యులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ఆర్థిక భారం మోపనుంది. 

మందుల ధరలపై యుద్ధం ప్రభావం
పశ్చిమాసియా సంక్షోభం వల్ల పెట్రోకెమికల్‌ సరఫరా గొలుసు దెబ్బతిన్నది. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయి. భారత ఫార్మా రంగం తయారు చేసే మందులకు సంబంధించి 70–80 శాతం ముడి సరుకులు చైనా, పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతోంది. దీంతో పారాసెటమాల్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్‌ (ఏపీఐ) ధర కిలోకు రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.450–600కు చేరింది. గ్లిజరిన్, ప్రొపైలిన్‌ గ్లైకాల్‌ వంటి సహాయక పదార్థాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో సిరప్‌లు, ఓరల్‌ డ్రాప్స్‌ తయారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది ఫార్మా తయారీదారులు ఉత్పత్తి ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న వాటిపై...
ఫార్మా రంగ వర్గాల సమాచారం మేరకు సుమారు 900 రకాల అత్యవసర మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త స్టాక్‌ వచ్చిన తర్వాతే ఈ పెరుగుదల పూర్తిగా అమలవుతుంది. ప్రస్తుత స్టాక్‌ (యుద్ధం ముందు తయారైనది) ఇప్పటికీ పాత ధరల్లోనే ఉంది. ఇందులో సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌+మినరల్స్‌ కలయికతో ఉండే ప్రొటీన్‌ గ్లూకోనెట్‌ అనే సప్లిమెంట్‌ ధరలు 200 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే అమాక్సిలిన్‌ యాంటీ బయోటిక్‌ మందు ప్రధాన ఔషధ ధర 50 శాతం పెరిగింది.

అలాగే పారాసెటమాల్‌ క్యాప్సుల్స్, ఆక్స్‌బార్, విక్‌బార్, గమ్‌ బెటల్‌ క్యాప్యూల్స్‌ వంటి నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్లు, గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్, డయాబెటిక్‌ ఔషధాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న మందులు మార్కెట్‌లోకి వస్తే భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్‌ (మెట్‌ఫార్మిన్, ఇన్సులిన్‌), హైపర్‌టెన్షన్, 
హృద్రోగం, కేన్సర్‌ వంటి వ్యాధులకు ఔషధాలు వాడేవారి నెలవారీ ఖర్చు 20–50 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

పాత ధరలకు సరఫరా చేయలేం
ప్రభుత్వ ఆసుపత్రులకు టీజీఎస్‌ఎంఐడీసీ ద్వారా మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ‘ఒప్పందం ప్రకారం పాత రేట్లకు మందులు సరఫరా చేయలేం. ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వాలి’ అని లేఖ రాసినట్లు తెలిసింది. ఫార్మా తయారీదారుల సంఘాలు సబ్సిడీలు, దిగుమతి రిబేట్, స్థానిక ఏపీఐ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి. కొన్ని పెట్రోకెమికల్‌ సాల్వెంట్స్‌పై కస్టమ్స్‌ డ్యూటీని మూడు నెలలు మినహాయించినప్పటికీ,  ఇది సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement