బడా కంపెనీలే లక్ష్యంగా అధికారిక ఈ–మెయిల్స్‌కు ఫిషింగ్ లింక్‌లు
దీంతో పూర్తిగా నేరగాళ్ల అదుపులోకి సిస్టమ్స్
సీఈవో, సీఎఫ్‌వోల పేరిట నకిలీ మెసేజ్‌లు పెట్టి భారీ మొత్తాలు కొట్టేస్తున్న వైనం
సాక్షి, హైదరాబాద్: వ్యాపార సంస్థల అధినేతలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) వంటి అధికారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారు. సంస్థల అధికారిక ఈ–మెయిల్స్‌కు మోసపూరిత ఫిషింగ్ లింకులు పంపించి, తద్వారా సంస్థ అధికారుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై సైబర్ నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్‌ను సాధించి అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఈతరహా కేసులు వెలుగు చూస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు.
ఎలా చేస్తారంటే?
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు నేరస్తుల నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తారు. సీఈఓ, సీఎఫ్‌ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని, తాము సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేయాలన్న సారాంశంతో అకౌంటెంట్లకు సెల్‌ఫోన్, వాట్సాప్ సందేశాలను పంపిస్తారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని కోట్లాది రూపాయల నగదు బదిలీ చేస్తారు.
సొమ్మును ఎలా మళ్లిస్తారంటే?
కంపెనీకి సంబంధించి ఉన్నతాధికారుల ముసుగులో అకౌంటెంట్లకు నకిలీ సందేశాలను పంపించి, వారి నుంచి కొట్టేసిన సొమ్మును నేరస్తులు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే వందలాది మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసుకుంటారు. గంటల వ్యవధిలోనే ఆసొమ్ము తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుంటారు. వాట్సాప్‌లో ఉన్నతాధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకుండా, వెంటనే ఆ అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధ్రువీకరించుకోవాలని సజ్జనార్ సూచించారు.
సంస్థలు ఏం చేయాలంటే?
⇒ కార్యాలయాలు, ఉన్నతాధికారులు వినియోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి.
⇒ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పనిసరిగా లాగౌట్ చేయాలి.
⇒ ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా, పబ్లిక్ వైఫైలను వినియోగించకూడదు.
⇒ సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఈ తరహా సైబర్ నేరస్తుల దాడులను ఎదుర్కోగలమన్న విషయాన్ని విస్మరించరాదు.
⇒ ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.


