ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి | Impact of West Asia Conflict Visible on Indian Pharma Sector: Rajesh Agrawal | Sakshi
Sakshi News home page

ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి

Apr 5 2026 4:03 AM | Updated on Apr 5 2026 4:03 AM

Impact of West Asia Conflict Visible on Indian Pharma Sector: Rajesh Agrawal

జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభిస్తున్న రాజేశ్‌ అగర్వాల్‌

భారత ఫార్మా రంగంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది

ఫార్మా రంగ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్‌

కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌

ఫార్మెక్సిల్‌ చింతన్‌ శివిర్‌ మూడో ఎడిషన్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న భౌగోళిక రాజకీయ పరి­స్థితులు అంతర్జాతీయ వాణిజ్య రూపు రేఖలను మారుస్తు­న్నా­యని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు భారతీయ ఔష­ధ రంగంపై కొంత మేర ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే ఈ రంగంలో సవాళ్లను అధిగమించేందుకు వినూత్న ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలపై ఫార్మా వర్గాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఫార్మా ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. భారత ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ‘చింతన్‌ శివిర్‌’ను రాజేశ్‌ అగర్వాల్‌ శనివారం ప్రారంభించారు.

దేశీయ మార్కెట్‌ లక్ష్యంగా ఔషధాలు
‘ప్రపంచ జనాభాలో 18 నుంచి 19 శాతం భారత్‌లోనే ఉండటం ఫార్మా రంగానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. జనరిక్స్‌ తయారీలో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నా ఏపీఐ, ఇంటర్మీడియెట్‌ల తయారీని స్థానికంగా పెంచడం ద్వారా దిగు­మతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు భారతీయ ఔషధాలు ఎగుమతి అవుతున్నా అనేక దేశాలకు 10శాతం కంటే తక్కువ ఎగుమతులు ఇక్కడ నుంచి జరుగుతున్నాయి.

ఫార్మా రంగంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌ వంటి కొత్త పోకడలకు అనుగుణంగా మా­రాలి. కొత్త పేటెంట్ల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడంతోపాటు ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలి. భౌగోళికంగా విచ్ఛిన్న పరిస్థితులున్న నేపథ్యంలో దిగుమతుల సరఫరా గొలుసును సురక్షితంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో­పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. 38 దేశాల ఆర్థిక వ్యవస్ధతో అనుసంధానమయ్యేలా 9 విదేశీ వా­ణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త మార్కెట్లకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

సీఈఓలతో సమావేశం
చింతన్‌ శివిర్‌లో భాగంగా ఫార్మా సీఈఓలతో ముఖాముఖి సమావేశం జరిగింది. మార్కెట్‌ అవకాశాలను ఉపయోగించుకోవటం, నియంత్రణ– నిబంధనల అమలు, ఎగు­మతు­ల వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలో వచ్చే సెప్టెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న 12వ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్‌కేర్‌ ఎగ్జిబిషన్‌ ఐపెక్స్‌–2026 షెడ్యూల్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజ భాను అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి, కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శులు మోహిత్‌ యాదవ్, సత్యప్రకాశ్‌ టీఎల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement