‘బాసర’కు రూ. 225 కోట్లు | CM Revanth review with officials development of Gyan Saraswati Temple | Sakshi
Sakshi News home page

‘బాసర’కు రూ. 225 కోట్లు

Apr 5 2026 2:58 AM | Updated on Apr 5 2026 2:58 AM

CM Revanth review with officials development of Gyan Saraswati Temple

జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

శాస్త్రాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి 

ప్రధాన ఆలయాల్లో టీటీడీ తరహా నిబంధనలు అమలు చేయాలి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో నియమ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ఎలాంటి ప్రదర్శనలు లేకుండా కేవలం ఆధ్యాత్మీకతకు పెద్ద పీట వేయాలని స్పష్టం చేశారు. రూ. 225 కోట్లతో బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సంబంధించి శనివారం ఆయన తన నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్‌ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ ను అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ.. బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. 

భవిష్యత్‌ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్‌లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలను నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్‌ సెంటర్‌ నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని, ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం చెప్పారు. వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని సీఎం చెప్పారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement