బెంగాల్ కురుక్షేత్రం: ‘దీదీ’ కోటలో ‘కమలం’ చిచ్చు | WB Corruption Allegations Explained School Jobs Scam | Sakshi
Sakshi News home page

బెంగాల్ కురుక్షేత్రం: ‘దీదీ’ కోటలో ‘కమలం’ చిచ్చు

Apr 5 2026 7:32 AM | Updated on Apr 5 2026 11:51 AM

WB Corruption Allegations Explained School Jobs Scam

పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వెంటాడుతున్న వరుస కుంభకోణాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార పక్షం సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం అవినీతి ఆరోపణలనే ప్రధాన అస్త్రంగా మార్చుకుని ఎన్నికల యుద్ధానికి దిగింది.

ఉద్యోగాల వేట.. జైలు గోడలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్’ టీఎంసీకి పెద్ద తలనొప్పిగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాల రద్దు, అర్హులైన అభ్యర్థుల రోడ్డున పడటం లాంటి అంశాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు కీలక నేతలు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. దీనికి తోడు రేషన్ కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు కూడా తోడవడంతో రాష్ట్రంలో ‘అవినీతి’ అనేది ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారుతోంది.

బెయిల్ పాలిటిక్స్: నైతిక విజయమా?
ఇటీవల జ్యోతిప్రియ మల్లిక్, అనుబ్రత మండల్ వంటి కీలక నేతలు బెయిల్‌పై విడుదలవ్వడం టీఎంసీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీన్ని తాము ఎదుర్కొంటున్న రాజకీయ కక్షసాధింపుపై లభించిన నైతిక విజయంగా టీఎంసీ అభివర్ణిస్తోంది. ‘బెయిల్ రావడం అంటే పాపం కడిగేసుకోవడం కాదు’ అని బీజేపీ హెచ్చరిస్తున్నా, జైలు నుంచి వచ్చిన నేతలు మాత్రం 2026లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బెయిల్ వ్యవహారాలు ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ కానున్నాయి.

ఛార్జ్‌షీట్ల యుద్ధం.. బీజేపీ వ్యూహం
ప్రతిపక్ష నేత సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ టీఎంసీని ఇరకాటంలో పెట్టేందుకు దూకుడు పెంచారు. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా ‘ఛార్జ్‌షీట్లు’ విడుదల చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. కేంద్ర నిధులను మళ్లించారని, ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తూ, బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తోంది. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని కమలనాథులు నినదిస్తున్నారు.

పరస్పర ఆరోపణల రచ్చ
టీఎంసీ కూడా బీజేపీపై ఎదురుదాడికి పదును పెట్టింది. ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వెళ్లగానే వారిపై ఉన్న కేసులు ఎలా మాయమవుతాయంటూ  పలు ఆరోపణలను ఎక్కుపెట్టింది. గతంలో నారద స్టింగ్ వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు బీజేపీ కండువా కప్పుకోగానే పవిత్రులు అయిపోయారా? అని మమతా బెనర్జీ  ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం అడ్డుకోవడం వెనుక రాజకీయ కక్ష ఉందన్న అభిషేక్ బెనర్జీ వాదనను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.

సంక్షేమం వర్సెస్ కుంభకోణం
2026 అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీ ప్రధానంగా తన సంక్షేమ పథకాలను ‘రక్షణ కవచం’గా భావిస్తున్నారు. ‘లక్ష్మీ భండార్’, ‘కన్యాశ్రీ’ వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని దీదీ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సంక్షేమ ఫలాలు.. ఈ రెండింటిలో బెంగాల్ ఓటర్లు దేనికి పట్టం కడతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement