క్యూఆర్ కోడ్.. కాగితం ముక్కలు.. ఇవే పట్టించాయి! | Shocking Facts In Uttar Pradesh Agra Incident | Sakshi
Sakshi News home page

క్యూఆర్ కోడ్.. కాగితం ముక్కలు.. ఇవే పట్టించాయి!

Apr 5 2026 11:18 AM | Updated on Apr 5 2026 1:40 PM

Shocking Facts In Uttar Pradesh Agra Incident

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ నెల ఏప్రిల్ 1న రాత్రి ఆగ్రాలోని సైయాన్ ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులకు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం సవాలుగా మారింది. అయితే, మృతుడి చేతిపై ఉన్న 'లోకేంద్ర' అనే పేరు గల టాటూ (పచ్చబొట్టు) మాత్రం చెరిగిపోకుండా ఉంది.

మరుసటి రోజు లోకేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన సోదరుడు రాత్రి ఇంటికి రాలేదని.. చివరిగా మహేష్ ప్రజాపతితో కలిసి కనిపించాడని పోలీసులకు తెలిపాడు. హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ఐదు బృందాలతో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో పోలీసులకు మద్యం బాటిళ్లతో పాటు కొన్ని కాగితం ముక్కలు లభించాయి. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు లోకేంద్ర భార్యను, ఆమె ప్రియుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధరమ్ వీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మహేష్‌కు లోకేంద్ర భార్యతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఇటీవల వీరి వ్యవహారం.. లోకేంద్రకు తెలియడంతో అతను భార్యను నిలదీశాడు. దీంతో తమ అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయలుదేరగానే.. అతని భార్య మహేష్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దారిలో లోకేంద్రను కలిసిన మహేష్, మద్యం తాగుదామని ఆహ్వానించాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో లోకేంద్ర అంగీకరించాడు. వీరితో పాటు ధరమ్ వీర్ కూడా చేరాడు. పొలాల్లో మద్యం తాగుతున్న సమయంలో మహేష్, ధరమ్ వీర్ కలిసి లోకేంద్ర గొంతు నులిమి స్పృహ తప్పేలా చేశారు. ఆపై అతనిపై పెట్రోల్ పోసి.. గడ్డి కప్పి నిప్పు పెట్టినట్లు మహేష్ పోలీసులకు వివరించాడు.

పశ్చిమ ఆగ్రా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య కుమార్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో దొరికిన కాగితం ముక్కల ద్వారా దర్యాప్తు మొదలైందని.. ఆ ప్రాంతంలోని ఒక పండ్ల వ్యాపారి అటువంటి కాగితాలను వాడుతుంటాడని తెలిసిందని చెప్పారు. అలాగే, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ల ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించి.. అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన బృందాలను ఆయన అభినందించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement