టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు | Google launches AI Gemma OpenAI buys a talkshow Anthropic biotech startup | Sakshi
Sakshi News home page

టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు

Apr 5 2026 12:18 PM | Updated on Apr 5 2026 1:43 PM

Google launches AI Gemma OpenAI buys a talkshow Anthropic biotech startup

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో దిగ్గజ కంపెనీలు ఇప్పుడు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతున్నాయి. గూగుల్ తన సరికొత్త ఓపెన్ సోర్స్ మోడల్ ‘జెమ్మా 4’ను ఉచితంగా అందుబాటులోకి తేగా, తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు ఓపెన్ ఏఐ ఏకంగా ఓ ప్రముఖ మీడియా టాక్ షోను కొనుగోలు చేసింది. మరోవైపు మరో ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ కనీవినీ ఎరుగని భారీ డీల్‌తో ఏకంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టింది. టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ మూడు ప్రధాన పరిణామాల వివరాలలోకి వెళితే..

ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో పనిచేసే గూగుల్ ‘జెమ్మా 4’
ఏఐ సాంకేతికత అనేది డెవలపర్లందరికీ ఉచితంగా, పబ్లిక్ వాడకానికి అనువుగా ఉండాలనే లక్ష్యంతో గూగుల్ అపాచీ 2.0 లైసెన్స్‌తో ‘జెమ్మా 4’ మోడల్స్‌ను విడుదల చేసింది. కోడింగ్ రాయడం, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించడంతో పాటు రియల్ వరల్డ్ టాస్క్‌లను ఇది సులభంగా చేయగలదు. మొత్తం నాలుగు వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ మోడల్స్ చాలా తేలికైనవి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే నేరుగా మన స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లలో కూడా సులభంగా రన్ అయ్యేలా వీటిని రూపొందించడం దీని ప్రధాన ఆకర్షణ.

మీడియా బిజినెస్‌లోకి ఓపెన్ ఏఐ ఎంట్రీ
చాట్‌జీపీటీ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’తన రూటు మార్చింది. సిలికాన్ వ్యాలీలో విశేష ఆదరణ పొందిన టెక్ టాక్ షో ‘ఐబీపీఎన్‌’ను సొంతం చేసుకుని మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. జాన్ కూగన్, జోర్డి హేస్ హోస్ట్ చేసే ఈ షో ద్వారా.. చాట్‌జీపీటీ, అలాగే సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌పై పబ్లిక్‌లో మరింత సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. కొనుగోలు డీల్ విలువను గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ షోకి పూర్తి సంపాదకీయ స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏసీఐ)గురించి ప్రజలతో మరింత మెరుగ్గా కనెక్ట్ అయ్యేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ స్ట్రాటజీ చీఫ్ ఫిడ్జీ సిమో తెలిపారు.

ఆంత్రోపిక్ మరో సంచలనం
ఓపెన్ ఏఐకి ప్రధాన పోటీదారు అయిన ‘ఆంత్రోపిక్’ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా 400 బిలియన్ డాలర్లు వెచ్చించి, బయోటెక్ ఏఐ స్టార్టప్ ‘కోఎఫిషియంట్ బయో’ను కొనుగోలు చేసింది. ఈ రికార్డ్ డీల్‌తో ఆంత్రోపిక్ హెల్త్‌కేర్ రంగంలోకి అధికారికంగా ప్రవేశించింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ టూల్స్ తయారుచేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆంత్రోపిక్ ఈ అడుగు వేసింది. కొత్త మందుల పరిశోధన (డ్రగ్ రీసెర్చ్), ఆవిష్కరణలను వేగవంతం చేయడం, అలాగే రెగ్యులేటరీ స్ట్రాటజీలను అభివృద్ధి చేయడంపై కోఎఫిషియంట్ బయో ప్రధానంగా దృష్టి సారించనుంది.

ఇది కూడా చదవండి: Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?

Advertisement
 
Advertisement
Advertisement