విజయ్‌ కొత్త అఫిడవిట్‌.. వెలుగులోకి రెండు కేసులు | Vijay discloses two pending FIRs in fresh affidavit | Sakshi
Sakshi News home page

విజయ్‌ కొత్త అఫిడవిట్‌.. వెలుగులోకి రెండు కేసులు

Apr 5 2026 1:33 PM | Updated on Apr 5 2026 1:33 PM

Vijay discloses two pending FIRs in fresh affidavit

చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న  ఎన్నికల సమరం జరగనుంది. అయితే ఇంతలో టీవీకే అధినేత విజయ్ సవరించిన అఫిడవిట్ సమర్పించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రస్తావించని రెండు కేసుల వివరాలను తాజాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన కొత్త అఫిడవిట్‌లో ఆయన వెల్లడించారు. మార్చి 30న తొలి నామినేషన్ వేసిన విజయ్.. ఏప్రిల్ 3న నోటరీ చేయించి, ఏప్రిల్ 4న తన ప్రతినిధి ద్వారా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో చెన్నై, మదురైలకు చెందిన రెండు క్రిమినల్ కేసుల వివరాలను కొత్తగా చేర్చారు.

ఆ రెండు కేసులు ఇవే..
మొదటి ఎఫ్‌ఐఆర్ (74/2026) చెన్నైలోని పెరవళ్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. మార్చి 30న ఎన్నికల ప్రచారంలో ప్రజాశాంతికి భంగం కలిగించారనేది ఆరోపణ. అయితే ఏప్రిల్ 2న సోషల్ మీడియా ద్వారానే ఈ కేసు గురించి తనకు తెలిసిందని విజయ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రెండో ఎఫ్‌ఐఆర్ (108/2025) మదురై జిల్లా కూడకోవిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. 2025 ఆగస్టు 21న జరిగిన పార్టీ సదస్సులో విజయ్ ర్యాంప్ వాక్ చేస్తుండగా, బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయనేది దీని సారాంశం. ఈ ఫిర్యాదుపై తనకు ఇంకా ఎలాంటి అధికారిక సమన్లు అందలేదని విజయ్ స్పష్టం చేశారు.

కోట్లలో ఆస్తులు.. పన్ను బకాయిలు..
క్రిమినల్ కేసుల జాబితా మారినా ఆస్తుల వివరాలు దాదాపు పాత అఫిడవిట్ మాదిరిగానే ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ గతంలో రూ.404.58 కోట్లు ఉండగా, అది కాస్తా రూ. 410.59 కోట్లకు పెరిగింది. ఇందులో రూ. 15 లక్షల విలువైన వెండి, రూ. 1.20 కోట్లకు పైగా విలువైన 883 గ్రాముల బంగారం ఉన్నాయి. నీలాంకరై, సాలిగ్రామంలోని వాణిజ్య, నివాస భవనాలతో కలుపుకుని ఆయన స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ. 184.53 కోట్లుగా చూపించిన ఆయన.. సుమారు రూ. 3.44 కోట్ల ఆదాయపు పన్ను బకాయిల వివాదం అప్పీలు దశలో ఉన్నట్లు వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్‌ స్థానానికి (ఏప్రిల్ 2న దాఖలు) ఇచ్చిన వివరాలకు, తొలిసారి పెరంబూర్ స్థానానికి ఇచ్చిన వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ, పెండింగ్ క్రిమినల్ కేసులన్నింటినీ బహిర్గతం చేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విజయ్ ఈ కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు సమచారం.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్‌’కు రూ. కోటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement