కేరళ పార్టీలకు పశ్చిమాసియా సెగ
2.25 లక్షలకు పైగా ప్రవాసీ ఓటర్లు
వారిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లోన
50 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తి
ఈసారి అత్యధికులు ఓటింగ్‌కు దూరం
యుద్ధ పరిస్థితులు, విమాన ధరలే కారణం
కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకుని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతుంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లోని మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. ఇది పార్టీల విజయావకా శాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయమని భావిస్తున్నారు.
కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ గల్ఫ్ ఓటర్లది కీలక పాత్రగా ఉంటూ వస్తోంది. ఆ దేశాల్లో 2.25 లక్షల మంది దాకా ఓటర్లున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారిలో కనీసం 60 శాతం పైచిలుకు ఓటింగ్ నమోదవడం పరిపాటి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బతో ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రూ.8 వేల నుంచి 13 వేలలోపు ఉండే టికెట్లు ఏకంగా రూ.60 వేల దాకా ఎగబాకాయి! పైగా సెలవులు తీసుకుని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి! దాంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీల సంఖ్య బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 10 శాతం ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు!
మలబార్‌లో కీలకం
ఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే గాక అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతుండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్‌మన్న అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో, కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది! తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉండటం విశేషం. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల పైచిలుకు ప్రవాస ఓటర్లున్నారు!! నాదపురంలో 12,424 మంది, తిరూర్‌లో 8,601, కళ్లియసెరిలో 8,097 మంది ప్రవాస ఓటర్లున్నారు. స్వల్ప మెజారిటీలు నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లే నిర్ణాయకంగా ఉంటూ వస్తున్నాయి.
కానీ ఈసారి వారు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కన్పించకపోవడంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇది ఒకరకంగా ఎదురుదెబ్బేనని ఓవర్‌సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (ఓఐసీసీ) పశ్చిమాసియా కన్వీనర్ కె.టి.ఎ.మునీర్ అభిప్రాయపడ్డారు. ‘‘గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ యూడీఎఫ్ కార్యకర్తల్లో 30 శాతం మంది, మద్దతుదారుల్లో 60 శాతం మంది ఈసారి ఓటింగ్‌కు రాలేకపోవచ్చు. విమాన టికెట్ల ధరలు నాలుగింతలు, అంతకుమించి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం’’ అంటూ ఆయన వాపోయారు. వారు గల్ఫ్ నుంచే ఓటేసేలా ఇ–ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటే తమకెంతో కలిసొచ్చేదని అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


