దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు: ప్రధాని మోదీ | PM Narendra Modi Says No injustice will be done to South States | Sakshi
Sakshi News home page

దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు: ప్రధాని మోదీ

Apr 5 2026 2:04 AM | Updated on Apr 5 2026 2:04 AM

PM Narendra Modi Says No injustice will be done to South States

లోక్‌సభ స్థానాల పెంపుపై ప్రధాని మోదీ స్పష్టీకరణ 

ఆ రాష్ట్రాల్లో స్థానాలు తగ్గవు

అన్యాయం జరుగుతుందన్నది దుష్ప్రచారమే 

స్థానాల పెంపుతో రాష్ట్రాలన్నింటికీ సమాన లబ్ధి

కేరళలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ

తిరువల్ల (కేరళ): లోక్‌సభ స్థానాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా ఆ రాష్ట్రాల్లో పెరిగే లోక్‌సభ స్థానాల సంఖ్య స్వల్పంగానే ఉండనుందన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘జనాభా పెరుగుదలను నియంత్రించిన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను తగ్గించే ప్రసక్తే ఉండబోదు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ లబ్ధి కలుగుతుంది’’అని వెల్లడించారు. శనివారం కేరళలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జన సంఖ్య తగ్గిన కారణంగా అక్కడ లోక్‌సభ స్థానాల సంఖ్యను తగ్గిస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ మాత్రమూ వాస్తవం లేదు. సీట్ల పెంపులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు ఏ మాత్రమూ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ విషయంలో వాటి ప్రయోజనాలను పరిరక్షించేందుకు పార్లమెంటు అన్ని చర్యలూ తీసుకుంటుంది’’అని ప్రకటించారు. ‘‘కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణ తదితర రాష్ట్రాలు జనాభా పెరుగుదలను విజయవంతంగా కట్టడి చేశాయి. జనాభా పెరుగుదల శాతం తక్కువగా ఉందన్న కారణంగా అవి లోక్‌సభ స్థానాలను కోల్పోవడానికి వీల్లేదు. స్థానాల పెంపులో వాటికి ఎలాంటి అన్యాయమూ జరగబోదు’’అని చెప్పారు. 

మహిళా బిల్లుపై పార్టీలు కలిసి రావాలి 
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను ఏప్రిల్‌ 16 నుంచి 18 దాకా మూడు రోజుల పాటు పొడిగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి సవరణలకు ఆ సందర్భంగా ఆమోదముద్ర పడనుందని మోదీ వెల్లడించారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించేలా నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ చట్టం తీసుకొచ్చాం. దానిపై పార్లమెంటు మూడు రోజుల పాటు చర్చించి మరింత ముందుకు తీసుకెళ్లనుంది. తద్వారా 2029 నుంచి పార్లమెంటులో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం దక్కేలా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే నారీ శక్తి అధినియమ్‌ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నా’’అన్నారు. ‘‘ఎన్డీఏ విధానాల అతి పెద్ద లబ్ధిదారులు మహిళలేనని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘మహిళా సాధికారత, వారికి సముచిత ప్రాతినిధ్యం మా ప్రాథమ్యాలు. మహిళల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ప్రతి ఇంటికీ టాయ్‌లెట్‌ సౌకర్యం కల్పించాం. లఖ్‌పతి దీదీ వంటి పథకాలు తెచ్చాం. మహిళల పేరిటే ఇళ్ల నిర్మాణం చేపట్టాం. జన్‌ధన్‌ ఖాతాలు తెరిచాం. వారికి ముద్రా లోన్లు అందేలా చేశాం. దాంతో ఎందరో మహిళలు సొంత వ్యాపారాలు మొదలు పెట్టడమే గాక వాటిని విజయవంతంగా నడుపుతూ రాణిస్తున్నారు’’అని వివరించారు. 

కాంగ్రెస్‌ విమర్శలు 
లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. ఈ విషయమై ఎన్డీఏ పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల సమావేశమయ్యారు. జనాభా ప్రాతిపదికగా కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం మేరకు స్థానాలను పెంచనున్నట్టు వెల్లడించారు. మహిళలకు 33 శాతం చొప్పున లోక్‌సభలో 273 స్థానాల దాకా వారికి రిజర్వు చేయనున్నారు. ఇందుకు వీలుగా డీ లిమిటేషన్‌ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును కూడా మోదీ సర్కారు పార్లమెంటు ముందు పెట్టనుంది. ఇందుకు వీలుగా, ఏప్రిల్‌ 2న నిరవధికంగా వాయిదా పడాల్సిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. లోక్‌సభ స్థానాల పెంపు నిర్ణయాన్ని, అందుకు ఎంచుకున్న సమయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రశ్నించింది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ఎత్తుగడకు దిగిందని విమర్శించింది. లోక్‌సభ స్థానాల పెంపు విషయంలో అన్ని పార్టీలను సంప్రదించకుండా మోదీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను కట్టడి చేసినందుకు అక్కడ లోక్‌సభ స్థానాలను తగ్గించి వాటిని శిక్షించరాదని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement