కేరళలో ఎల్‌డీఎఫ్‌ ఇక ఇంటికే..  | Countdown to LDF exit in Kerala, says Pm Narendra Modi | Sakshi
Sakshi News home page

కేరళలో ఎల్‌డీఎఫ్‌ ఇక ఇంటికే.. 

Apr 5 2026 4:08 AM | Updated on Apr 5 2026 6:21 AM

Countdown to LDF exit in Kerala, says Pm Narendra Modi

వామపక్ష ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య రహస్య స్నేహం  

ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం  

తిరువల్ల/తిరువనంతపురం: కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని తేల్చిచెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. శనివారం కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. 

రాష్ట్రంలో వామపక్షాల పాలనకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఎల్‌డీఎఫ్‌ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాలతోపాటు గోవాలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదే తరహాలో కేరళలోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు.  

అవినీతి, మతతత్వమే అవరోధాలు 
కేరళలో ప్రగతికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలోనే ఉండిపోయిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ ప్రభుత్వాలు కేరళను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఇక్కడి అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు.

 కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలతో ప్రధానంగా మహిళలే అత్యధికంగా లబ్ధి పొందారని వెల్లడించారు. కేరళలో ప్రగతికి అవినీతి, మతతత్వం అతిపెద్ద అవరోధాలుగా మారాయన్నారు. అవి తొలగిపోవాలంటే ఎల్‌డీఎఫ్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

బీజేపీకి బీ–టీమ్‌ అంటూ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు సరస్పరం నిందలు వేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి కేరళలో ఎ–టీమ్‌ బీజేపీ మాత్రమేనని స్పష్టంచేశారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య రహస్య స్నేహం సాగుతోందన్నారు. అవి రెండు ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని విమర్శించారు. అందుకే ఆ రెండు పక్షాలు బీజేపీని టార్గెట్‌ చేస్తున్నాయని ఆరోపించారు. 

తాము అధికారంలోకి రాగానే ఎల్‌డీఎప్, యూడీఎఫ్‌ల అరాచకాలపై దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంపై కాంగ్రెస్‌ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. వారి నోటిదురుసు వల్ల పశ్చిమాసియాలోని భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. గల్ఫ్‌లో మన భారతీయుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  

తిరువనంతపురంలో భారీ రోడ్‌ షో 
ప్రధాని మోదీ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సాయంత్రం రోడ్‌ షోలో పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. వీధులు కిక్కిరిసిపోయాయి. నగరం జనసంద్రాన్ని తలపించింది. మోదీ ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ అభ్యర్థులు పాలుపంచుకున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన మో దీ రోడ్‌ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement