బెంగళూరు: రాష్ట్రంలో గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. 3 ఉచిత టికెట్ల కోసం ఎమ్మెల్యేల పీఏలు విధానసభలో స్పీకర్ కార్యాలయం ముందు శనివారం బారులుతీరారు. ప్రతి మ్యాచ్‌కు ఎమ్మెల్యేకు 3 టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం క్రికెట్ సంఘాన్ని ఆదేశించడం తెలిసిందే. ఆ టికెట్లు సభాపతి ఆఫీసుకు వస్తే అక్కడ ఎమ్మెల్యేలకు బట్వాడా చేస్తారు.
జాగ్రత్తలు పాటించాలి: కమిషనర్
పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ గత మ్యాచ్ ప్రశాంతంగా జరిగిందని చెబుతూ, ఈసారి మ్యాచ్‌కు 4 గంటల ముందుగానే ప్రేక్షకులు మైదానానికి రావాలన్నారు. ఎలాంటి భౌతిక టికెట్‌లు లేకుండగా క్యూఆర్ టికెట్‌లను మాత్రమే అనుమతిస్తారు. టికెట్ ఎవరి పేరుపై బుక్ అయిఉంటుందో వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. టికెట్లు ఉన్నవారు మెట్రో రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు, నిర్దేశిత స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఉంది. టికెట్ లేనివారు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించరాదు, అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ మ్యాచ్‌కు 2,500 పోలీసులతో భద్రత కల్పించామన్నారు.


