20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్‌ దెబ్బ , ట్రంప్‌నకు భారీ షాక్‌ | US Military Aircraft Hit First Shot Down By Enemy Fire In Over 20 Years Amid Ongoing Tensions For Iran War, More Details Inside | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్‌ దెబ్బ , ట్రంప్‌నకు భారీ షాక్‌

Apr 4 2026 5:34 PM | Updated on Apr 4 2026 6:08 PM

Iran war US military aircraft hit first shot down by enemy fire in over 20 years

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై తొలిసారిగా దాడులు చేసిన ఐదు వారాల తర్వాత ఇరాన్‌ అమెరికాకు భారీ షాక్‌ ఇచ్చింది. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్‌ దాడి చేసింది. గత 20 ఏళ్లకు పైగా కాలంలో అమెరికాకు జరగని అత్యంత అరుదైన దాడిగా నిలిచింది. 

క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గి పోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన వెంటనే జరిగిన ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్‌లు కూలిపోవడం  ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గత 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే మొదటిసారి.

20 ఏళ్ల తర్వాత తొలిసారి: ఇరాన్ చేతిలో కూలిన అమెరికా యుద్ధ విమానాలు

శుక్రవారం ఇరాన్ ఒక F15-E స్ట్రైక్ ఈగిల్ (Strike Eagle) యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇందులో ఉన్న ఒక సైనికుడిని రక్షించగా, రెండో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్‌బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్‌ హయాంలో జరగడం గమనార్హం. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. 

ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్‌ : గూగుల్‌లోని‌ ఈ పాలసీ తెలుసా?

చావో రేవో- ఇరాన్ వ్యూహం
ప్రస్తుతం ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా పోరాడుతోందని, చావో రేవో అన్న రీతిలో ఎదురు దాడులకు దిగుతోందని చెబుతున్నారు.  ఫిబ్రవరి 28 మొదలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత ఐదు వారాలుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నాయని ట్రంప్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందీ అనడానికి ఈ దాడులే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.

ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న వైమానిక యుద్ధం ఇప్పటివరకు భారీ విజయం  అన్నారు రిటైర్డ్ మెరైన్ కల్నల్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో సీనియర్ రక్షణ సలహాదారు మార్క్ కాన్సియన్.   రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు ఒకానొక దశలో 3 శాతంగా ఉండేదని, ఇది ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

అమెరికా విమానాలను కూల్చడానికి  రాడార్లకు కూడ ఆ చిక్కని భుజంపై నుండి ప్రయోగించే (Shoulder-fired) క్షిపణులను వాడి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేస్తున్నాయి. ఇదే ఇరాన్‌కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు. కాగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా దళాలు ఇప్పటివరకు 13,000 కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించాయి. 12,300 లక్ష్యాలను ధ్వంసం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement