ఆ ముగ్గురు ఐఏఎస్‌లు హాజరుకావాలి | High Court orders Principal Secretaries of Finance and Irrigation Departments | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు ఐఏఎస్‌లు హాజరుకావాలి

Apr 5 2026 4:26 AM | Updated on Apr 5 2026 4:27 AM

High Court orders Principal Secretaries of Finance and Irrigation Departments

ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రధాన కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన ఏడుగురు ఉద్యోగులకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాదులైన ఆర్థిక, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్, వరంగల్‌ ఎస్‌ఈ, కొత్తగూడెం డివిజన్‌ ఈఈ, ఖమ్మం జిల్లా కలెక్టర్‌.. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరిలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులున్నారు. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.

తమను క్రమబద్దీకరించకపోవడాన్ని, పింఛన్‌ సహా ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు (గతంలో) జగన్నాథం సహా పలువురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సింగిల్‌ జడ్జి వీరికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ అధికారులు అప్పీల్‌ వేశారు. అప్పీల్‌ను ద్విసభ్య ధర్మాసనం పాక్షికంగా అనుమతించింది. 

ఖమ్మం జిల్లాకు చెందిన జగన్నాథం సహా మరికొందరి సేవలను 1993, నవంబర్‌ 25 నుంచి అన్ని ప్రయోజనాలతో క్రమబద్ధీకరించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించి, బి.శ్రీనివాస్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పింఛన్‌ సహా ఇతర ప్రయోజనాలు కల్పించాలని 2023, సెప్టెంబర్ లో ఆదేశించింది. 

అయినా ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జగన్నాథం సహా మరికొందరు బాధితులు 2024లో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ శామ్‌కోషి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ధిక్కరణ పిటిషన్‌ను పరిశీలించిన ప్రతివాదులను తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement