ఆప్షన్‌ ఇచ్చి తరలండి! | The process of sending RTC staff from the city to the districts has begun | Sakshi
Sakshi News home page

ఆప్షన్‌ ఇచ్చి తరలండి!

Apr 5 2026 4:31 AM | Updated on Apr 5 2026 4:31 AM

The process of sending RTC staff from the city to the districts has begun

నగరం నుంచి ఆర్టీసీ సిబ్బందిని జిల్లాలకు పంపే ప్రక్రియ షురూ

ఏప్రిల్‌ 15లోగా ఆప్షన్లు ఇవ్వాలని ఎండీ ఆదేశాలు

కండక్టర్లు మినహా డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి తప్పని స్థానచలనం

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో నగరంలో ఈ కేటగిరీ సిబ్బంది జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి 

సాక్షి, హైదరాబాద్‌: నగరం నుంచి ఆర్టీసీ సిబ్బంది తరలింపునకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఎవరు ఏ రీజియన్‌లో పనిచేయదలుచుకున్నారో ఆప్షన్‌ల ద్వారా చెప్పాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15లోగా ఆప్షన్లను సేకరించి అందజేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీన్ని అత్యవసర ప్రక్రియగా భావించాలని స్పష్టం చేయటం విశేషం.  

త్వరలో ఔటర్‌ రింగురోడ్డు లోపల ఎలక్ట్రిక్‌ బస్సులను మాత్రమే తిప్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి, అందుకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ బస్సులు వచ్చే కొద్దీ తత్సమాన సంఖ్యలో డీజిల్‌ బస్సులను జిల్లాలకు బదిలీ చేస్తారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. రెండు సంస్థలు వాటిని నిర్వహిస్తాయి. అప్పుడు నగరంలోని డిపోలన్నింటిని వాటికే అప్పగించనున్నారు. 

అద్దె ప్రాతిపదికన నిర్వహించనున్నందున వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్‌ సిబ్బందిని ఆయా సంస్థలే నియమించుకోవాల్సి ఉంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. డిపోల్లో డీఎంలు, అసిస్టెంట్‌ డీఎంలు, అకౌంట్స్‌ సిబ్బంది, కండక్టర్లు...లాంటి వారు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి పనిచేస్తారు. మిగతా ఆర్టీసీ సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించాల్సిందే. ఈ క్రమంలోనే సిబ్బంది కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఆప్షన్‌ ఇచ్చుకునే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది.  

» హైదరాబాద్‌ జోన్‌ (గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వెలుపలి దక్షిణ తెలంగాణ ప్రాంతం), కరీంనగర్‌ జోన్‌ల పరిధిలో డిప్యుటేషన్‌ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది.  
»  పదోతరగతి, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న డ్రైవర్లు నగరంలో కండక్టర్లుగా పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది. దీనికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది.  
»  మెకానిక్‌లు వారి విద్యార్హత ఆధారంగా ఏడీఎస్‌లుగా, బస్‌పాస్‌ కౌంటర్‌ సిబ్బందిగా, భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు పార్కింగ్‌ డ్రైవర్లుగా ఓడీతో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.  
» డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కలిపి నగరంలో దాదాపు 8 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరినీ తరలించాల్సి ఉంది.  
» ప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, నగరంలో కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ఇక ప్రస్తుతం 2 వేల కండక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇటీవల 1,700 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీని అదనంగా మారే డ్రైవర్లకు కండక్టర్‌ పోస్టు ఇవ్వటం ద్వారా భర్తీ చేస్తారు.  
»   కండక్టర్‌ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement