వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల సమయమే మిగిలి ఉందని చెప్పారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హార్మూజ్ తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ప్రళయానికి మరో 48 గంటలే మిగిలి ఉందని ట్రంప్ చెప్పారు.
‘ఇరాన్‌కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల తర్వాత అన్నీ విధ్వంసం అవుతాయి’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పేర్కొన్నారు.
కాగా, అమెరికా సైనిక విమానాలకు జరిగిన నష్టం ఇష్యూ ఇరాన్‌తో దౌత్య చర్చలపై ప్రభావం చూపదని ఇవాళ ఉదయం ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల కూల్చివేత ఘటన చర్చలను దెబ్బతీస్తుందనే వాదనలను ట్రంప్ తిరస్కరించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తూ.. ఇరాన్ రాజధానిలో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. తమ వైమానిక దళం టెహ్రాన్‌లో బాలిస్టిక్, వైమానిక రక్షణ క్షిపణి నిల్వ కేంద్రాలపై దాడి చేసిందని చెప్పింది. అదే దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక పరిశోధన అభివృద్ధి సదుపాయాలు కూడా ఉన్నాయి అని తెలిపింది.


