ఇరాన్‌లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి | Projectile hits near Iran's Bushehr nuclear facility; kills one person | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి

Apr 4 2026 4:21 PM | Updated on Apr 4 2026 5:41 PM

 Projectile hits near Iran's Bushehr nuclear facility; kills one person

టెహ్రాన్: ఇరాన్‌లో శనివారం (ఏప్రిల్‌ 4న) ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిధి సమీపంలో ఒక క్షిపణి పడింది. దీంతో అక్కడి ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్ తెలిపింది. ఈ ఘటనలో అణు విద్యుత్‌ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు. కానీ, సహాయక భవనం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం పడలేదు.

బుషెహర్ దక్షిణ ఇరాన్‌లో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఆ దేశపు మొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఇరాన్ మౌలిక వసతులు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘అమెరికా సైన్యం ఇరాన్‌లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు" అని అన్నారు. ఇంతలోనే ఇవాళ ఈ దాడి జరగడం గమనార్హం.

"మా సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది, ఇరాన్‌లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు. తర్వాత వంతెనలు, ఆపై విద్యుత్ కేంద్రాలు నాశనం చేస్తాం. ఇరాన్‌లోని కొత్త పాలకులకు చేయాల్సిన పనుల గురించి తెలుసు, వెంటనే చేయాలి’ అని డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. అవసరమైతే ఇరాన్‌ను రాతి యుగానికి తీసుకెళ్లేలా బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఇవాళ ఉదయం ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం.. అమెరికా, పశ్చిమాసియాలోని దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఖాతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి ఇబ్రాహీం జోల్ఫఘారి ఓ ప్రకటన విడుదల చేసి.. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించారు.  

పశ్చిమాసియాలోని దేశాలపై యుద్ధం చేస్తూనే సొంత దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షిస్తోంది ఇరాన్‌. ఇరాన్ నిషేధిత ప్రతిపక్ష గగ్రూప్‌ పీపుల్స్ మొజాహెదిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ (పీఎంఓఐ/ఎంఈకే) సభ్యులుగా తేలిన ఇద్దరు పురుషులను ఉరి తీసింది. ఈ వివయాలను ఇరాన్ న్యాయవ్యవస్థ వెబ్‌సైట్ మిజాన్ ఆన్‌లైన్‌లో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement