హార్మూజ్‌ను దాటిన గ్రీన్‌ శాన్వీ  | India seventh LPG tanker successfully crossed the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ను దాటిన గ్రీన్‌ శాన్వీ 

Apr 5 2026 1:05 AM | Updated on Apr 5 2026 6:17 AM

India seventh LPG tanker successfully crossed the Strait of Hormuz

భారత్‌ దిశగా వస్తున్న ఇంధన నౌక 

న్యూఢిల్లీ: భారత్‌ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్‌ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్‌ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్‌ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్‌కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్‌ను దాటిన గ్రీన్‌ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్‌ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. 

వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్‌ లడ్కీ, పైన్‌ గ్యాస్, జగ్‌ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్‌ఎం ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. గ్రీన్‌ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్‌ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్‌’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్‌కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్‌ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. 

చైనా దిశగా ఇరాన్‌ నౌకపై భారత్‌ స్పష్టీకరణ 
ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌ దిశగా వస్తున్న ఇరాన్‌ చమురు నౌక ‘పింగ్‌ షున్‌’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్‌కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్‌కు ఏడేళ్ల తర్వాత గుజరాత్‌లోని వడినార్‌కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్‌ షున్‌’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్‌తో భారత్‌కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement