దిగిరాకుంటే నరకమే!  | Donald Trump gives Iran 48 hours to make deal or face Hell | Sakshi
Sakshi News home page

దిగిరాకుంటే నరకమే! 

Apr 5 2026 12:51 AM | Updated on Apr 5 2026 12:51 AM

Donald Trump gives Iran 48 hours to make deal or face Hell

మరో 48 గంటలే మిగిలింది   ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు

అణుకేంద్రంపై బాంబుల వర్షం 

కె–10 ఫైటర్‌ జెట్‌ను కూల్చిన ఇరాన్‌ 

మరో కె–10 విమానంపైనా దాడులు? 

రెండు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లకూ నష్టం

దుబాయ్‌: హార్మూజ్‌ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. లేదంటే కనీవినీ ఎరగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్‌ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్‌ 6తో ముగుస్తోంది. 

ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్‌ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్‌ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు! 

టెహ్రాన్‌పై బాంబుల వర్షం 
ఇరాన్‌పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషెహర్‌లోని అణు విద్యుత్కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంటుపై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ‘‘దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాకపోతే రేడియేషన్‌ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరట’’అని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్‌ అణుకేంద్రాలపై జరిగిన నాలుగో దాడి. టెహ్రాన్‌లో ఒక పెట్రో కెమికల్‌ ప్లాంట్‌పైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. 

రాజధాని టెహ్రాన్‌ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై భారీగా ప్రతి దాడులకు దిగింది. దుబాయ్‌లోని ఒరాకిల్‌ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్‌గా మారింది. తమపైకి ఇరాన్‌ ప్రయోగించిన 23 బాలిస్టిక్‌ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్‌ దాడులు జరిగినట్టు బహ్రెయిన్‌ తెలిపింది.

పైలట్‌ కోసం వేట! 
శుక్రవారం నాటి ఇరాన్‌ దాడుల్లో ఎఫ్‌–15ఇ స్ట్రైక్‌ ఈగల్‌ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్‌ థగ్‌ ఫైటర్‌ జెట్‌ను కూడా అమెరికా కోల్పోయిట్టు తెలుస్తోంది. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్‌ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు’’అని అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎఫ్‌–15ను ఇరాన్‌ తమ గగనతనంలోనే కూల్చేయడం తెలిసిందే. అందులోని పైలట్‌తో పాటు గన్నర్‌ సురక్షితంగా బయటపడ్డారు. 

వారు నైరుతి ఇరాన్‌లోని కొగిలుయె, బోయర్‌–అహ్మద్‌ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. మరొకరి కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇరాన్‌ కూడా అతన్ని ఎలాగైనా నిర్బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం నాటి రెస్క్యూ ఆపరేషన్‌ సందర్భంగా రెండు అమెరికా హెచ్‌హెచ్‌–60డబ్లు్య జాలీ గ్రీన్‌–2 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు కూడా ఇరాన్‌ దాడుల్లో దెబ్బ తిన్నట్టు సమాచారం. 

అవి కష్టమ్మీద ఇరాన్‌ భూభాగాన్ని దాటి సురక్షిత స్థానానికి చేరినా వాటి పైలట్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారమే మరో కె–10 యుద్ధ విమానం కూడా ఇరాన్‌ దాడుల్లో దెబ్బ తిన్నట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొనడం విశేషం. ‘‘ఒక ఇంజన్‌ విఫలమైంది. దాంతో అది సింగిల్‌ ఇంజన్‌తోనే అతి కష్టమ్మీద గల్ఫ్‌లోని వైమానిక స్థావరానికి చేరుకుంది’’అని వెల్లడించాయి! అయితే ఈ ఉదంతం చర్చల ప్రక్రియను ప్రభావితం చేయబోదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ భూభాగంపై అమెరికా యుద్ధవిమానాలను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! అగ్ర రాజ్యం చివరిసారిగా 2003లో ఇరాక్‌ యుద్ధ సమయంలో ఏ–10 థండర్‌బోల్ట్‌ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.

మీ కుమారులకు ట్రంప్‌తోనే ముప్పు 
హాని తలపెట్టొద్దన్న పైలట్‌ తల్లి విజ్ఞప్తికి ఇరాన్‌ కౌంటర్‌ 
టెహ్రాన్‌: శత్రు దేశ పైలట్‌ అనే ప్రతీకారేచ్ఛతో తన కుమారుడికి హాని తలపెట్టొద్దని అమెరికా పైలట్‌ తల్లి చేసిన విజ్ఞప్తికి ఇరాన్‌ తనదైన రీతిలో బదులిచ్చింది. దాడి కోసం వచ్చి తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్‌ శుక్రవారం నేలకూల్చడం తెల్సిందే. దీంతో పైలట్లు బయటకు దూకేయగా ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్‌ సేనలు రక్షించి వెంటతీసుకెళ్లాయి. మరో పైలట్‌జాడ తెలీడం లేదు. అతడిని ఇరాన్‌ బంధించిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒక పైలట్‌ తల్లి విజ్ఞప్తిచేశారు. ‘‘ఎఫ్‌–15 ఫైటర్‌జెట్‌ పైలట్లకు హాని తలపెట్టకండి. వారిలో ఒకతను నా కుమారుడు’’అని ఆమె వేడుకున్నారు. 

దీంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయాలు దీటుగా స్పందించాయి. ‘‘ఇరాన్‌ కస్టడీకంటే మీ కుమారులకు డొనాల్డ్‌ జూనియర్‌ ట్రంప్‌తోనే ముప్పు ఉంది. అమెరికా రెస్క్యూ టీమ్‌లకు దొరక్కుండా మా కస్టడీలోనే వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకోండి. అమెరికాకు దొరికితే ఏమేం రహస్యాలు వెల్లడించారని చెప్పి చిత్రవధ చేస్తారు. ముస్లింలుగా, నాగరికత తెల్సిన ఇరానియన్లుగా మాకు మీ వాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. మర్యాదతో, గౌరవప్రదంగా చూసుకుంటాం. అమానవీయ యూదనీతుల కంటే యుద్ధనీతులు మాకు బాగా తెలుసు. యుద్ధఖైదీలను పద్ధతిగా చూసుకుంటాం. మేం ఆలోచనల్లో అమెరికా మాదిరి రాతియుగంలో బతకట్లేము’’అని ఎంబసీలు బదులిచ్చాయి.  

బోర్‌ కొడుతోంది, ఏమన్నా మాట్లాడండి! 
ట్రంప్‌ బెదిరింపులపై ఇరాన్‌ ఎద్దేవా 
ట్రంప్‌ తాజా హెచ్చరికలను ఇరాన్‌ తేలిగ్గా తీసిపడేసింది. అమెరికాతో చర్చలకు తామే దిగొచ్చామన్న ట్రంప్‌ వ్యాఖ్యలను మరోసారి ఖండించింది. అధ్యక్షుని మాటలకు ఇప్పుడెవరూ పెద్దగా విలువ ఇవ్వడం లేదనే అర్థం వచ్చేలా జింబాబ్వేలోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం శనివారం ఎక్స్‌లో పోస్టు పెట్టింది! ‘‘మాకు బాగా బోర్‌ కొడుతోంది. ఏదో ఒకటి మాట్లాడండి’’అంటూ ట్రంప్‌ మాటతీరును ఎద్దేవా చేసింది.  

చర్చలకు ఇరాన్‌ సుముఖత! 
అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇరాన్‌ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చర్చల నిమిత్తం పాక్‌ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ శనివారం స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement