తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, చైనాతో ఒక వినూత్నమైన వాణిజ్య ఒప్పందానికి తెరలేపింది. చైనాలో విపరీతమైన డిమాండ్ ఉన్న గాడిద చర్మం (హైడ్), మాంసం ఎగుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికోసం చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కీలక కేంద్రమైన గ్వాదర్ పోర్ట్ సమీపంలో గాడిదల వధశాల (స్లాటర్ హౌస్), ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గాడిద చర్మం ఎందుకంటే..
ఈ విచిత్రమైన వాణిజ్యం వెనుక చైనా సాంప్రదాయ వైద్య రంగానికి ఉన్న అవసరాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. చైనాలో గాడిద చర్మం నుంచి తయారుచేసే ‘ఎజియావో’ అనే జిలాటిన్ ఆధారిత ఔషధానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. రక్తప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ సంరక్షణ, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాసెస్ చేసిన ఎజియావో కిలో ధర వందల డాలర్లలో పలుకుతుంది. అయితే, చైనాలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో 1990లలో 1.1 కోట్లుగా ఉన్న గాడిదల సంఖ్య ప్రస్తుతం 20 లక్షల కంటే దిగువకు పడిపోయింది. దీంతో వార్షికంగా చైనాకు అవసరమయ్యే దాదాపు 59 లక్షల గాడిద చర్మాల కోసం ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు.
ఆఫ్రికాలో నిషేధం
గతంలో చైనాకు ప్రధాన వనరుగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు గాడిదల ఎగుమతిపై నిషేధం విధించడంతో చైనా దృష్టి ఆసియా వైపు మళ్లింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గాడిదల జనాభా (సుమారు 58 లక్షలకు పైగా) కలిగిన పాకిస్థాన్, ఈ అవకాశాన్ని విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గంగా మార్చుకుంది. గ్వాదర్ ఫ్రీ జోన్‌లో ప్రాసెసింగ్ సదుపాయాల ద్వారా టన్నుల కొద్దీ ఘనీభవించిన మాంసం, చర్మాలను చైనాకు నౌకల ద్వారా రవాణా చేస్తున్నారు.
పాకిస్థాన్ వాదన ఇదే..
అయితే ఈ నిర్ణయంపై పాకిస్థాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ నియమాల ప్రకారం గాడిద మాంసం వినియోగం నిషిద్ధం కావడంతో, కేవలం ఎగుమతికే పరిమితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, రవాణాకు జీవనాధారమైన గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందని స్థానికులు, జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలకు, ఆర్థిక అవసరాలకు ఈ గాడిదల దౌత్యం ఒక విచిత్ర నిదర్శనంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన కొత్త రూల్స్!


