ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ అప్పుకోసం చేయని ప్రయత్నాలు లేవు. నిజాలను దాచిపెట్టి, మోసం చేసి, పన్నాగాలు పన్నయినా సరే అప్పులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) అక్టోబర్‌లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై రూ.70 లక్షల నజరానా ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చింది.
ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్యను కేవలం చూపించడానికి చేసిన చర్యగా పలువురు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.
గతంలోనూ ఇలాంటి ప్రకటన
మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్ గతంలోనూ ఇలాంటి ప్రకటన చేసింది. 2021లో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల సమయంలో, మసూద్ అజర్‌పై చర్యల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు అతడు పాకిస్థాన్ నుంచి అదృశ్యమై అఫ్గానిస్థాన్‌కు వెళ్లినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అదే ఏడాది ఎఫ్‌ఐఏ అతడిపై రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పుడు ఐదు ఏళ్ల తర్వాత విడుదలైన కొత్త రెడ్ బుక్‌లో ఆ మొత్తాన్ని రూ.70 లక్షలకు పెంచింది.
మసూద్ అజర్ పాకిస్థాన్‌లో లేడని, అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడని పాకిస్థాన్ పదేపదే చెబుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అతడిపై నజరానా పెంచుతూ ప్రకటన చేయడం ఆ దేశ చర్యపై సందేహాలకు దారితీస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉగ్ర కార్యకలాపాలతో మసూద్ అజర్ పేరు ముడిపడి ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం బహావల్‌పూర్‌లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చర్య చేపట్టింది.
అక్టోబర్ ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి నెలకొంది. మసూద్ అజర్‌ను పట్టుకునేందుకు ఇది నిజమైన ప్రయత్నమా.. లేక ఎఫ్‌ఏటీఎఫ్ ముందు చర్యలు తీసుకున్నట్లు చూపించే ప్రయత్నమా అన్నది తదుపరి పరిణామాల్లో తేలనుంది.
ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే జాబితాలో పాక్ పేరు ఉంటే అప్పులు, పెట్టుబడులపై ప్రభావం పడొచ్చు. అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారులు దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో నిధులు సమకూర్చుకోవడం కష్టతరం.


