బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలో బుర్ఖా ధరించి గుర్తింపును దాచుకున్నారన్న ఆరోపణపై 76 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. హాంప్‌షైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌతాంప్టన్‌లోని హెడ్‌జ్ ఎండ్‌కు చెందిన తిమోతీ మిల్లర్‌పై నిరసన సందర్భంగా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే దుస్తులు ధరించినట్లు అభియోగం నమోదైంది.
మిల్లర్ శనివారం జరిగిన నిరసనలో అరెస్టైన పలువురిలో ఒకరు. పోర్ట్స్‌మౌత్ నగర కేంద్రంలో సౌత్ కోస్ట్ పేట్రియాట్స్, స్టాండ్ అప్ టు రేసిజం బృందాలకు చెందిన వందలాది మంది పరస్పరం నిరసనలు చేపట్టారు. మిల్లర్ సోమవారం పోర్ట్స్‌మౌత్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
ఇదే ఘటనలో డేవిడ్ మెక్‌నాలీ అనే 33 ఏళ్ల వ్యక్తిపై రహదారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నేరపూరిత నష్టం కలిగించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. అంతకుముందు ఆదివారం ఈస్ట్‌నీ మెరీనాలో జరిగిన అల్లర్లకు సంబంధించి 16 ఏళ్ల యువకుడిని హింసాత్మక అల్లర్ల అనుమానంతో అరెస్టు చేశారు. అతడిని బెయిల్‌పై విడుదల చేశారు.

అంతకుముందు ఈ నెలలో పోర్ట్స్‌మౌత్‌లో శరణార్థులను నగరానికి తీసుకురావడాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వందలాది మంది మితవాద నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖాన్ని కప్పుకునేలా వస్త్రాలు ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
హాంప్‌షైర్ పోలీసులు సెక్షన్ 60ఏఏ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నిరసనకారులు ముసుగులు, ముఖాన్ని కప్పే వస్త్రాలు లేదా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే ఇతర వస్తువులను తొలగించాలని పోలీసులు ఆదేశించవచ్చు.
“ప్రశాంతంగా, చట్టబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలనుకునేవారికి మేము మద్దతు ఇస్తాం. భయాన్ని సృష్టించడం, హింసను రెచ్చగొట్టడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నవారిని మాత్రం సహించం” అని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ పాల్ బార్టోలోమియో తెలిపారు.
ఈ కేసులతో పాటు గతంలో జరిగిన నిరసనకు సంబంధించి 42 ఏళ్ల డెల్ లియోన్ సోమర్విల్లేపై హింసాత్మక అల్లర్లు, విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.


