రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య జెమీమా | Imran Khan ex wife Jemima Goldsmith family confirms her marriage | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య జెమీమా

Sep 14 2026 6:31 PM | Updated on Sep 14 2026 6:31 PM

 Imran Khan ex wife Jemima Goldsmith family confirms her marriage

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌ (52) రెండో వివాహం చేసుకున్నారు. ఐరిష్‌-ఆస్ట్రేలియన్‌ వ్యాపారవేత్త, మల్టీ మిలియనీర్‌ ఆర్థికవేత్త కామెరూన్‌ ఓరైలీ (62)ని జెమీమా వివాహం చేసుకున్నట్లు ఆమె కుటుంబం ధ్రువీకరించింది. ఈ వివాహం వారాంతంలో జరిగినట్లు సమాచారం.

జెమీమా గోల్డ్‌స్మిత్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ దాదాపు 9 సంవత్సరాల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు సులేమాన్‌, కాసిమ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం కోసం, ఆయనకు మద్దతుగా ఈ ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు.

జెమీమా సోదరుడు బెన్‌ భార్య జెమీమా జోన్స్‌ సామాజిక మాధ్యమంలో వివాహ వేడుకకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. “జెమీమా, కామెరూన్‌ వివాహ వేడుకను జరుపుకుంటున్నాం.. ఎంత సంతోషకరమైన రోజు” అంటూ ఆమె పేర్కొన్నారు. జెమీమా, కామెరూన్‌ ఓరైలీకి సినిమాలు, డాక్యుమెంటరీలపై ఉన్న ఉమ్మడి ఆసక్తి ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

జెమీమాకు ఎన్నో నైపుణ్యాలు 
జెమీమా గోల్డ్‌స్మిత్‌ నిర్మాణ సంస్థ ఇన్‌స్టింక్ట్‌ ప్రొడక్షన్స్‌ స్థాపించారు. పలు చిత్రాలు, కార్యక్రమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ‘వాట్స్‌ లవ్‌ గాట్‌ టు డూ విత్‌ ఇట్‌?’ చిత్రానికి కూడా ఆమె రచన, నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. న్యూ స్టేట్స్‌మన్‌, వానిటీ ఫెయిర్‌ వంటి పత్రికల్లో సంపాదకురాలిగా, రచయితగా పనిచేశారు. మానవ హక్కుల అంశాలపై ఆమె బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ జైలులో ఉండటంపై కూడా జెమీమా స్పందించారు. “ఇది ఇక కేవలం పాకిస్థాన్‌ రాజకీయ వ్యవహారం కాదు. ఇది మానవ హక్కుల అత్యవసర పరిస్థితి” అని ఆమె పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ బ్రిటన్‌తో ఉన్న దీర్ఘకాల సంబంధాలు, ఆయన కుమారులు బ్రిటిష్‌ పౌరులు అయినప్పటికీ తండ్రి ఆరోగ్యం క్షీణించడాన్ని దూరం నుంచి చూడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జెమీమా రెండో వివాహం నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం, ఆయన కుమారుల ప్రచారం వంటి అంశాలపై ఆమె భవిష్యత్తులో చేసే వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement