ఆన్‌లైన్ షాపింగ్ వేదికల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 10న కొత్త ఈ-కామర్స్ నిబంధనలను ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల విక్రయ సరళిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, అమలు గడువు 2027 కావడం వల్ల ఈ ఏటి పండగల సీజన్ సేల్స్‌పై ఎలాంటి తక్షణ ప్రభావం ఉండబోదు.
డిస్కౌంట్ల లెక్కింపులో పారదర్శకత
ఇన్నాళ్లూ కృత్రిమంగా ఎక్కువ ధరలను (ఎంఆర్‌పీ) చూపిస్తూ భారీ శాతం తగ్గింపులను ప్రకటించే విక్రేతలకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఆఫర్ ధరతో పాటు దానికి ముందు ఉన్న ప్రీయర్ ప్రైస్‌ను కూడా స్పష్టంగా చూపించాలి. ఆఫర్ ప్రకటించడానికి ముందు 30 రోజుల్లో సదరు వస్తువు లభించిన అతి తక్కువ ధరనే ‘ప్రీయర్ ప్రైస్’గా పరిగణిస్తారు. దీనివల్ల అవాస్తవిక డిస్కౌంట్ ప్రకటనలకు కాలంచెల్లనుంది.
మానిప్యులేషన్‌కు చెక్
కొనుగోలుదారులు వెతికే సెర్చ్ ఫలితాలను పక్కదోవ పట్టించేలా అల్గారిథమ్‌లను మార్చకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకటనల ద్వారా పొందే స్పాన్సర్డ్ లిస్టింగ్స్‌ను ప్రత్యేకంగా, స్పష్టంగా వినియోగదారునికి తెలిసేలా ప్రదర్శించాలి. ఆన్‌లైన్ సంస్థలకు యాడ్స్ కీలక ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ఆర్గానిక్ సెర్చ్‌కూ.. పెయిడ్ విజిబిలిటీకీ తేడా చూపించడం తప్పనిసరి కానుంది.
వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యం
డార్క్ పాటర్న్స్(అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు వినియోగదారులను తాము బలవంతంగా నిర్ణయాలు తీసుకునేలా తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించే డిజైనింగ్ వ్యవస్థ) అడ్డుకట్టకు వార్షిక సెల్ఫ్-ఆడిట్ సర్టిఫికేషన్, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌తో అనుసంధానం వంటి చర్యలు ఈ-కామర్స్ స్వేచ్ఛా వ్యాపార ధోరణికి సరైన నియంత్రణలు తేనున్నాయి.
ఇదీ చదవండి: పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్!


