అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. ఓ కార్గో ప్రమాదం ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి బయటకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న వాహనాల్ని ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన కార్గో విమానం ఆదివారం ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి మియామికి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండింగ్ చేస్తుండగా అదుపుతప్పి రన్‌వేను దాటింది. అనంతరం విమానం విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గోదాములు, ఇతర వ్యాపార సంస్థలకు వెళ్లే రహదారిపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది.
మియామి-డేడ్ కౌంటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది. విమానం కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ చిక్కుకుపోయారు. కొన్ని వాహనాల్లోని వ్యక్తులు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోవడంతో సహాయక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి బయటకు తీశారు.
భారీ రెస్క్యూ ఆపరేషన్
సమాచారం అందుకున్న వెంటనే సుమారు 200 మంది అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 60కిపైగా అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానంలోని ఇంధనం లీకవుతుండటంతో దాన్ని నియంత్రించే చర్యలు కూడా చేపట్టారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయంలో కొంతసేపు విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రాకపోకలపై ప్రభావం
ప్రమాదం కారణంగా మియామి విమానాశ్రయంలో 160కిపైగా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 325 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలను 320 కిలోమీటర్ల దూరంలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం విమానాశ్రయ కార్యకలాపాలను దశలవారీగా పునరుద్ధరించారు.
ఏం జరిగిందసలు?
ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు సుమారు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అమెరికా జాతీయ వాతావరణ సేవ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
32 ఏళ్ల బోయింగ్ విమానం
ప్రమాదానికి గురైన కార్గో విమానం బోయింగ్ 767. ఇది తొలుత ప్రయాణికుల విమానంగా నిర్మించబడింది. రెండు దశాబ్దాలకు పైగా పలు విమానయాన సంస్థల్లో సేవలందించిన తర్వాత 2015లో కార్గో విమానంగా మార్చారు. ఈ విమానాన్ని అమెజాన్ తరఫున అమెరికాకు చెందిన కార్గో క్యారియర్ 21 Air నిర్వహిస్తోంది.
దర్యాప్తు ప్రారంభం
ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి. NTSB చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెండీ నేతృత్వంలో ప్రత్యేక బృందం మియామికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించనుంది. విమానం రన్‌వేపై ఎక్కడ ల్యాండ్ అయింది? ల్యాండింగ్ సమయంలో వేగం ఎంత ఉంది? రన్‌వే చివరికి చేరుకునేలోపు ఎందుకు నియంత్రణలోకి రాలేదు? వంటి అంశాలపై దర్యాప్తులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఇటు ఈ ఘటనపై అమెజాన్ సంస్థ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.
🚨 Update: Deadly Cargo Plane Crash at Miami International Airport
At least five people have died and five others were injured after an Amazon Prime Air cargo aircraft overran the runway at Miami International Airport on Sunday afternoon, striking multiple vehicles and bursting… pic.twitter.com/6XLpT6mVaP— FL360aero (@fl360aero) September 7, 2026


