నేపాల్‌కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు. దార్చుల్లా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలానీ నదిలోకి మట్టి, రాళ్లు వచ్చిపడి నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నది దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
చౌలానీని చామెలియా నది అని కూడా పిలుస్తారు. ఇది అపిహిమాల్ ప్రాంతంలో పుట్టి మహాకాళీ నదిలో కలుస్తుంది. మహాకాళీ నది కొంత భాగం నేపాల్–భారత్ సరిహద్దుగా ప్రవహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత కొండచరియలు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడడం ప్రారంభించాయి. మట్టి, రాళ్లు జారిపడడాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఏదో ప్రళయం వచ్చినట్లు ఆ దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి.
అయితే ఈ ప్రభావంతో నది మరింతగా పూడుకుపోయి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని దార్చుల్లా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అదే జరిగితే నదీ ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి.. ఒక్కసారిగా తెగిపడి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో నదికి సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేలా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచారు.
Today, a large landslide has partially blocked the Chaulani River in Api Himal Rural Municipality, Darchula District, Sudurpashchim Province, Nepal.
Authorities are urging residents downstream to remain alert amid the risk of sudden flooding. pic.twitter.com/7UuxGPsDjg— Weather Monitor (@WeatherMonitors) September 4, 2026
పశ్చిమ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖగ్రాజ్ భట్టా కూడా అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించి.. హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తొలగని ముప్పు..
అధికారులు చెబుతోంది ఏంటంటే.. చౌలానీ నదిలో ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే పర్వాలేదు. నీటి ప్రవాహం సాధారణంగానే ఉంది. అయితే కొండచరియలు ఇంకా విరిగిపడే అవకాశం ఉండటంతో ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు, స్థానికులను అప్రమత్తం చేసేందుకు చామెలియా జలవిద్యుత్ కేంద్ర భద్రతా స్థావరానికి చెందిన సాయుధ పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఇదిలా ఉండగా.. భట్టార్ ప్రాంతంలోని పది కుటుంబాలను ముందు జాగ్రత్తగా బంధువుల ఇళ్లకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారికి టెంట్లు సహా అవసరమైన సామగ్రిని అందించారు. అయితే కొండచరియలు విరిగిపడి.. అక్కడి రహదారులు, ట్రెక్కింగ్ మార్గాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
మరోసారి ప్రకృతి ప్రకోపం
ఇటీవలే నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1,287 మృతదేహాలను వెలికితీయగా.. మరో 5,083 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ దార్చుల్లాలో తాజా కొండచరియల ఘటన ఆందోళన కలిగిస్తోంది.
చౌలానీ నది ప్రవాహానికి కొండచరియలు అడ్డంకిగా మారడంతో.. మరిన్ని కొండచరియలు విరిగిపడి నది పూర్తిగా మూసుకుపోతే ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఫ్లాష్‌ఫ్లడ్ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: అసలు అక్కడి భూగర్భంలో ఏం జరుగుతోంది?


