ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పొందే నేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు అందరి కళ్లముందే కనిపించకుండా పోతే? అందులోనూ అధికారిక విమానం నుంచి మరో విమానంలో రహస్యంగా ప్రయాణించాల్సి వస్తే? వినడానికి హాలీవుడ్ థ్రిల్లర్‌లా అనిపించే ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇప్పుడు అదే ఆసక్తికర ఉదంతాన్ని ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా అందించింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? థ్రిల్ పంచిందా?..
స్టోరీ ఏంటంటే.. టర్కీలో జరిగిన నాటో సదస్సు అనంతరం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరిగి బయలుదేరిన సమయంలో అసలు కథ మొదలవుతుంది. అందరూ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ఉన్నారని భావించారు. కానీ భద్రతా కారణాలతో ఆయనను క్యాటరింగ్ ట్రక్ ద్వారా విమానం నుంచి బయటకు తీసుకొచ్చి.. చిన్నదైన మరో మిలిటరీ విమానంలో తరలించారు. అసలు విమానం మాత్రం ట్రంప్ అందులోనే ఉన్నట్టుగా నమ్మించే ‘డికాయ్’గా కొనసాగింది. అప్పట్లో విమానంలో ఉన్న జర్నలిస్టులు, కొందరు ఉన్నతాధికారులకు కూడా అసలు విషయం తెలియకపోవడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది.
ఫ్లస్ పాయింట్లు.. ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్(Instadocs: The Decoy Plane) డాక్యుమెంటరీకి ప్రధాన బలం ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్నవారి మాటలే. రాయిటర్స్ వైట్‌హౌస్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫొటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డాన్ లామోత్‌తో పాటు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్, మాజీ ఎయిర్‌ఫోర్స్ వన్ సిబ్బంది వాండా జోయెల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్నవారికి ఎలా అనిపించిందో ప్రేక్షకుడు అర్థం చేసుకునేలా తెరకెక్కించారు.
అయితే చిన్న నిడివి ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్‌గా మారింది (Instadocs: The Decoy Plane Review). అనవసరమైన ఉపకథలు (Side Track) లేకుండా నేరుగా అసలు విషయానికే వెళ్లడం వల్ల ఆసక్తి నిలుస్తుంది. ముఖ్యంగా క్యాటరింగ్ ట్రక్, మూసిన కిటికీలు, అనుమానాస్పద కదలికలు.. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. ఇవన్నీ ఒక మిస్టరీని ఛేదిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.
నెగెటివ్ ఏంటంటే.. అయితే ఇది(Trump The Decoy Plane Doc) పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అనుకోవద్దు. కేవలం అరగంటలో ఒకే ఘటనను చెప్పేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంటరీ కావడంతో.. లోతైన రాజకీయ విశ్లేషణకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇరాన్ థ్రెట్.. ఇజ్రాయెల్ వార్నింగ్.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్రంప్ భద్రతా బలగాలు చేసిన పని.. ఇలా ఏవీ ఇందులో కనిపించవు. ట్రంప్ చుట్టూ ఉన్న రాజకీయ వివాదాల కంటే.. భద్రతా వ్యవస్థ ఎలా పనిచేసింది? మీడియాను ఎందుకు చీకట్లో ఉంచారు? అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.
ఓవరాల్‌గా.. రాజకీయాలు, అమెరికా అధ్యక్షుడి భద్రత, వైట్‌హౌస్ వ్యవహారాలు, నిజ జీవితంలోని విచిత్రమైన ఘటనలు ఆసక్తిగా చూసేవారికి ‘ది డికాయ్ ప్లేన్’ ఒక మంచి షార్ట్ వాచ్. పెద్ద సినిమా స్థాయి డ్రామా కోసం కాకుండా.. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది?’ అనే కుతూహలంతో చూస్తే మాత్రం నిరాశపరచదు.


