పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్‌ఏ | 25 Pakistani soldiers killed in Balochistan BLA releases video | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్‌ఏ

Sep 5 2026 12:39 PM | Updated on Sep 5 2026 12:39 PM

25 Pakistani soldiers killed in Balochistan BLA releases video

బలూచిస్థాన్‌లో బీఎల్ఏ దెబ్బకు పాక్‌ ఆర్మీ విలవిల్లాడుతోంది. పాక్‌ సైనిక కాన్వాయ్‌పై బీఎల్‌ఏ మెరుపుదాడితో క్షణాల్లోనే వాహనాలు పేలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న సైనిక వాహనాలు.. తుపాకుల మోతతో బలూచిస్థాన్‌ దద్దరిల్లింది. 25 మంది పాక్‌ సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించడంతో పాకిస్తాన్‌ ఉలిక్కిపడింది. వెంటనే ప్రతీకార దాడులకు దిగిన పాక్‌ ఆర్మీ.. దాదాపు 50 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అసలు బలూచిస్థాన్‌లో ఏం జరుగుతోంది? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

బలూచిస్థాన్‌లో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) వరుస దాడులతో పాక్‌ సైన్యానికి సవాల్‌ విసిరింది. రెండు వేర్వేరు దాడుల్లో 25 మంది పాకిస్థాన్‌ సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. శుక్రవారం జియారత్‌ క్రాస్‌ వద్ద పాక్‌ సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏకు చెందిన ‘ఫతేహ్‌ స్క్వాడ్‌’ మెరుపుదాడి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ దాడిలో రెండు సైనిక వాహనాలను ధ్వంసం చేసి 18 మంది సైనికులను హతమార్చినట్లు తెలిపింది. మరో ఐదుగురు సైనికులు గాయపడినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకున్నారని పేర్కొంది. ఇటీవలి నెలల్లో బలూచ్‌ వేర్పాటువాదులు జరిపిన అతిపెద్ద, అత్యంత సాహసోపేతమైన దాడుల్లో ఇదొకటిగా చెబుతోంది.

దాడులకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ అధికారిక మీడియా సంస్థ ‘హక్కల్‌’ విడుదల చేసింది. అందులో పాక్‌ సైనిక వాహనాలు మంటల్లో కాలిపోతుండటం, భారీ పేలుళ్లు, కాల్పులు కనిపించాయి. ధ్వంసమైన సైనిక వాహనాల నుంచి ఆయుధాలను బీఎల్ఏ సభ్యులు స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. మరోవైపు సురాబ్‌లోని హజీకా ప్రాంతంలో బీఎల్ఏకు చెందిన ‘STOS’ యూనిట్‌ రిమోట్‌ కంట్రోల్‌ వాహనంతో పేలుడు జరిపినట్లు ప్రకటించింది. ఈ దాడిలో ఏడుగురు పాక్‌ సైనికులు మరణించినట్లు తెలిపింది. అయితే బీఎల్ఏ వెల్లడించిన మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయారు. పాకిస్తాన్‌ సైన్యం కూడా ఈ దాడులపై పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బీఎల్ఏకు చెందిన ఫతేహ్‌ స్క్వాడ్‌ బలూచిస్థాన్‌లోని పర్వత ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధం, మెరుపుదాడుల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక విభాగంగా పేర్కొంటారు. 2025 మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేసిన ఘటనలోనూ ఈ యూనిట్‌ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ప్రపంచ పటం మారుబోతుందా?.. అమెరికా ఏం చెబతోంది?

ఇదిలా ఉండగా.. తాజా దాడులకు ప్రతీకారంగా పాక్‌ సైన్యం కూడా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. మస్తుంగ్‌, సిబి, క్వెట్టా, కలాట్‌ జిల్లాల్లో మిలిటెంట్‌ స్థావరాలపై దాడులు నిర్వహించి దాదాపు 50 మంది ఉగ్రవాదులు లేదా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్‌ సైన్యం ప్రకటించింది. హతమైన వారిలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీతో పాటు తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్తాన్‌ (TTP)కు చెందినవారు ఉన్నారని పేర్కొంది. దీంతో బలూచిస్థాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కొనసాగుతోంది. బలూచ్‌ వేర్పాటువాద సంస్థలు పాకిస్థాన్‌ భద్రతా బలగాలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాలు, రాజకీయ కార్యకర్తలపై అణచివేత వంటి ఆరోపణలు చేస్తున్నాయి. బలూచిస్థాన్‌కు అధిక స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కల్పించాలన్న డిమాండ్‌తో పలు సంస్థలు సాయుధ పోరాటం కొనసాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement