పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా నగరంలో టిక్‌టాక్ ఫాలోవర్ల విషయంలో జరిగిన గొడవలో ఓ యువతి తన చెల్లిని కత్తితో పొడిచి హత్య చేసింది నిందితురాలిని అరెస్ట్ చేసిన లాధే వాలా వర్రాయిచ్ పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవరుగా పనిచేస్తున్న తండ్రి అబ్దుల్ షకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్ షకూర్‌కు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మంగళవారం కొంతమంది అతిథులు తన ఇంటికి వచ్చారని.. తాను కింది అంతస్తులో వారితో మాట్లాడుతుండగా పై అంతస్తు నుంచి అరుపులు వినిపించాయని ఆయన తెలిపారు. వెంటనే పై అంతస్తుకు వెళ్లి చూడగా తన కుమార్తె మనాహిల్ రక్తపు మడుగులో కనిపించిందని చెప్పారు. మొదట ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మధ్య డబ్బు విషయంపై గొడవ జరిగిందని తండ్రి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఇద్దరు సోదరీమణులు టిక్‌టాక్‌లో చురుకుగా ఉండేవారు. టిక్‌టాక్ ద్వారా కొంత ఆదాయం సంపాదించేందుకు వారు ప్రయత్నించేవారని తెలిసింది. ఈ క్రమంలో చెల్లెలి ఖాతాకు ఆదరణ భారీగా ఉండటంతో ఆమె తన ఫాలోవర్లను లాగేసుకుంటోందంటూ కాయ్‌నాత్.. జోబియాతో గొడవ పడింది. దీంతో తన చెల్లెలు వీపుపై పొడిచింది. తీవ్రంగా గాయపడిన జోబియాను ఆసుపత్రికి తరలించగా, అధిక రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను తండ్రే పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.


